రానున్న వానాకాలం సీజన్లో ఎరువుల కొరత రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా, నిల్వలపై ఆన్‌లైన్‌లో సమీక్షించారు. ప్రస్తుతం అందుబాటులో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు ఉండగా... వీటిలో 3.73 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ముందే చుసుకోండి..
కరోనా పరిస్థితుల దృష్ట్యా గత వానాకాలం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్క్‌ఫెడ్ వద్ద ప్రస్తుతం ఉన్న బఫర్ నిల్వలను జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు తరలించి ఎరువుల కొరత రాకుడా చూసుకోవాలని తెలిపారు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములు మరో 15 రోజుల్లో అందుబాటులోకి వస్తాయని... వరంగల్, ఖమ్మం, వనపర్తిలోని కొత్త గిడ్డంగులను ఎరువుల నిల్వలకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ సంస్థ ఉద్యోగులకు కొవిడ్ టీకా వేయించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థ అధికారులు పాల్గొన్నారు.