తెలంగాణలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ అనుకూల విధానాలతో ముందుకు వెళ్తూ నియంత్రిత సాగు ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న పంటల సాగు ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా.. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
దిల్లీలో ఆన్‌లైన్ వేదికగా జరిగిన జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రాంతీయ కమిటీ సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర, వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, వివిధ రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నారు.
మద్దతు ధర లభించాలి..
రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల్లో వరి, 60 లక్షల ఎకరాల్లో పత్తి, 11 లక్షల ఎకరాల్లో కందితోపాటు ఆముదాలు, జొన్నలు, సోయాబీన్, వేరుశనగ సాగయ్యాయయని, ఆయిల్‌పామ్ సాగు కూడా ప్రోత్సహిస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతులకు కష్టానికి తగిన ఫలితం, మద్దతు ధర లభించాలన్నదే తమ ఉద్దేశమని.. మొత్తం రూ. కోటి 45 లక్షల ఎకరాలలో ఈ వానా కాలంలో పంటలు సాగవుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.