రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడం వల్ల పత్తి సాగు విస్తీర్ణం తగ్గి... వరి పంట సాగు 55 లక్షల ఎకరాలకు పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో వానాకాలం - 2021 పురోగతిపై మంత్రి సమీక్షించారు (minister niranjan reddy review). రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తాజా ఖరీఫ్ సీజన్‌లో వరి పంట సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి అంచనా, కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ, రవాణా, మిల్లింగ్, గోదాముల సన్నద్ధత, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎకరానికి సరాసరి 27 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాల మేరకు కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ... మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. వానాకాలం ఉత్పత్తిలో ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ అంగీకరించిన దృష్ట్యా... మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్ర అవసరాల అంచనా..
ఇతర రాష్ట్రాలకు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వెళ్తుందని అంచనా వేయగా... రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆహార అవసరాల నిమిత్తం ఏడాదికి సరాసరి వినియోగించే బియ్యం 56 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేసినట్లు చెప్పారు. అందుకోసం 83.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ధాన్యం సేకరించే కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వరి పంట ఉత్పత్తి పెరుగుతూ వస్తుందని... పంజాబ్‌లో పెద్ద ఎత్తున వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నా స్థానికంగా వినియోగం లేదని అన్నారు.