Startups in Telangana Villages : కొత్త కొత్త ఆలోచనలతో, వినూత్న ప్రయోగాలతో సత్తా చాటే గ్రామీణ యువతకు చేయూత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇది వరకు రాజధాని నగరానికే పరిమితమైన అంకురాలు(స్టార్టప్స్).. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ కార్యకలాపాలను మొదలుపెట్టనున్నాయి. ఈ దిశగా స్టార్టప్ విలేజ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ (గ్రామీణ అంకుర పరిశ్రమల కార్యక్రమం)కు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది.
Startup Village Entrepreneurship Program in Telangana : ఇందుకోసం ఇప్పటికే రూ.50 కోట్లు కేటాయించిన సర్కారు.. తొలి విడతగా 19 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. జయశంకర్ భూపాలపల్లి, జనగామ, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, ములుగు, నాగర్‌కర్నూల్, హనుమకొండ, ఆదిలాబాద్, సిద్దిపేట, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 4 దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
పూర్తి సహకారం..: ఈ కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల్లో అంకుర సంస్థలను నెలకొల్పడానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందించనుంది. అవసరమైన సాంకేతిక నైపుణ్య శిక్షణ, సలహాలను టీ-హబ్, వీ-హబ్ వంటి సంస్థలు అందించనున్నాయి. ప్రారంభించిన స్టార్టప్స్ స్థిరంగా కొనసాగడానికి స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల ద్వారా రుణం అందించేందుకు సహకరించనున్నాయి.
గ్రామీణ అంకుర పరిశ్రమల కార్యక్రమం ద్వారా నిరుద్యోగితను తగ్గించడంతో పాటు గ్రామీణ యువతను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో విజయవంతమైన ఈ స్టార్టప్ విధానాన్ని గ్రామాలకూ విస్తరించి.. తద్వారా అక్కడి యువతకు చేయూత, ఉపాధి కల్పన ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ట్యాలెంట్ ఉండి.. ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తోన్న ఎందరికో ఈ కార్యక్రమం చక్కని అవకాశంగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.