SSC Exams Starts Today in Telangana : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 456 పాఠశాలలకు చెందిన 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో 2 లక్షల 43 వేల 852 బాలురు కాగా.. 2 లక్షల 41 వేల 974 మంది బాలికలు ఉన్నారు. ఆంగ్ల మాధ్యమంలో 3 లక్షల 78 వేల 794 మంది రాస్తుండగా.. తెలుగులో 98 వేల 726 మంది.. ఉర్దూలో 7,851, హిందీలో 235, మరాఠీలో 137, కన్నడలో 83 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి : రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 652 కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్ పరీక్ష రోజున భౌతిక, జీవశాస్త్రం ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలు వేర్వేరుగా ఇస్తారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా.. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఐదు నిమిషాల గ్రేస్ సమయంతో కలిపి.. అంటే 9 గంటల 35 నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. సైన్స్, ప్రథమ భాష కాంపోజిట్ కోర్సు పరీక్షకు మాత్రం 20 నిమిషాల అదనపు సమయంతో కలిపి 12 గంటల 50 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు.