sriramanavami celebrations in telangana: తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలను దర్శించి సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. పలు చోట్లు భక్తులు సైతం కల్యాణాన్ని జరిపించారు. వివిధ జిల్లాల్లో ఎమ్మెల్యేలు సైతం దేవాలయాలకు వెళ్లి సీతారాములకు బట్టలు సమర్పించడం, కల్యాణం జరిపించడం లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో రామనవమి వేడుకలు:హైదరాబాద్ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణంలో... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాతబస్తీ ఉప్పర్ గూడా మాదన్నపేటలోని నాలుగు శతాబ్దాల నాటి పురాతనమైన రామాలయంలో కల్యాణానికి... పోలీస్ శాఖ తరపున సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రూపేష్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో వైభవోపేతంగా వేడుకలు నిర్వహించారు. కూకట్ పల్లిలో 450 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పుననిర్మాణం చేపట్టిన తర్వాత వేలాది మంది భక్తుల సమక్షంలో కమనీయమైన కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలో.. కళ్యాణ మహోత్సవానికి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎల్బీనగర్‌లోని చిత్ర లేఔట్ లో.. కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతా రాముల కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు.
ఆదిలాబాద్‌లో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం:ఆదిలాబాద్ హౌసింగ్‌బోర్డు కాలనీ, శాంతినగర్, చాందా(టి) రామాలయాల్లో వేకువజామునుంచే భక్తులు బారులు తీరారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో పంచముఖి హనుమాన్ ఆలయంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కలెక్టర్ పదావత్ సంతోష్ పల్లవి దంపతులు.. మాల మార్పిడి సందర్భంగా నృత్యం చేస్తూ.. వైభవంగా క్రతువు పూర్తిచేశారు. బెల్లంపల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో కళ్యాణంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జూనియర్ సివిల్ జడ్జి జస్టిస్ హిమబిందు హాజరయ్యారు. నిర్మల్‌లో హిందూ వాహిని ఆధ్వర్యంలో శోభాయాత్ర కన్నుల పండుగ జరిగింది. దేవరకోట దేవస్థానం నుంచి భారీ శ్రీరాముని విగ్రహంతో శోభాయాత్ర చేపట్టారు. భైంసాలోని పురాణ బజార్ గోశాల నుంచి హిందువాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరాముని శోభాయాత్రను.. భాజపా నాయకులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మంచిర్యాలలో మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో.. శ్రీరాముని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చిన్నారుల పౌరాణిక వేషధారణలను ఆకట్టుకున్నాయి.