Sri Rama Navami Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. పలుప్రాంతాల్లో స్వామివారి జగత్ కల్యాణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ పుణ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కన్నుల పండువగా సాగిన స్వామివారి కల్యాణ క్రతువును చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పంచోపనిషత్తు ద్వారా శ్రీ సీతారామ చంద్రమూర్తి స్వామివార్లకు అభిషేకాలు, స్వామివారి మూలవిరాట్‌కు పండితులు కల్యాణం జరిపారు.
రాములోరి కల్యాణానికి హాజరైన మంత్రులు : సిద్దిపేటలోని హనుమంతుడిన దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు.. సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోను సీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. మహబూబాబాద్‌లోని రామమందిరంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని ఊరు వాడల్లో సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా సాగాయి. శ్రీరామనవమి సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన రాములోరి కల్యాణ మహోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు పాల్గొని తలంబ్రాలు సమర్పించారు. హైదరాబాద్ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు. కార్పొరేటర్ లక్ష్మి బల్రెడ్డితోపాటు తలసాని దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.
కమనీయంగా కోదండరాముని కల్యాణం : ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలో దైవకార్యాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి లోక కళ్యాణం వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ హాజరయ్యారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో 450 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పుననిర్మాణం చేపట్టిన తర్వాత వేలాది మంది భక్తుల సమక్షంలో కమనీయమైన కల్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వనస్థలిపురం గణేష్ దేవాలయంలో జరిగిన కోదండరాముడి కళ్యాణానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చీమలదరి గ్రామంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగా జరిగింది.