శ్రీశైలానికి భారీ వరద కొనసాగుతుండటంతో బుధవారం సాయంత్రం గేట్లు తెరుచుకోనున్నాయి. 2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మిగిలిన సంవత్సరాల్లో ప్రత్యేకించి ఆలమట్టి నిర్మాణం తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబరులోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అటు ఆలమట్టి, ఇటు తుంగభద్రల నుంచి భారీ నీటి విడుదలతో మంగళవారం సాయంత్రం 6 గంటలకు 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. తుంగభద్ర కూడా నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణా, గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోనున్నాయి. మరో వారం రోజులు శ్రీశైలంలోకి ఇదే ప్రవాహం కొనసాగితే నాగార్జునసాగర్ కూడా నిండే అవకాశం ఉంది.
ఆలమట్టి నుంచి ప్రవాహం..
ఆలమట్టిలోకి 3.92 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, మూడు లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ముందుజాగ్రత్తగా నీటినిల్వను తగ్గించారు. 129 టీఎంసీల సామర్థ్యం ఉండగా, 82 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచారు. దిగువన ఉన్న నారాయణపూర్ నుంచి 3.05 లక్షల క్యూసెక్కుల నీటిని జూరాలకు వదిలారు. జూరాల జలాశయంలోకి మంగళవారం సాయంత్రం 7 గంటలకు 3.28 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.12 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి పునఃప్రారంభమైంది.100.86 టీఎంసీల సామర్థ్యం గల తుంగభద్ర(కర్ణాటక)లో 96.31 టీఎంసీలు ఉంది. లక్షా 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 80 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. సుంకేసుల జలాశయానికి 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 22 గేట్లను ఎత్తి 1.06 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి పెరిగిన వరద
శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 172.66 టీఎంసీల నిల్వ ఉంది. అటు జూరాల, ఇటు తుంగభద్ర నుంచి వచ్చే నీటితో శ్రీశైలానికి వరద మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం 6 నుంచి మంగళవారం సాయంత్రం 6 వరకు 24 గంటల్లో 26 టీఎంసీలు వచ్చింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. గురువారం ఉదయానికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనున్నా.. ముందుజాగ్రత్తగా బుధవారం సాయంత్రం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ మురళీనాథ్‌రెడ్డి తెలిపారు.