తెలంగాణ

telangana

ETV Bharat / state

SRDP PROJECTS: ట్రాఫిక్‌ సమస్య తగ్గించేలా ఎస్​ఆర్​డీపీ రెండో దశ పనులు - Telangana news

SRDP PROJECTS: గ్రేటర్‌ హైదరాబాద్‌లో నగరవాసులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేలా... ప్రభుత్వం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం-ఎస్​ఆర్​డీపీ చేపట్టింది. రెండో దశలో భాగంగా... రూ. 5వేల 240కోట్లతో 43 ప్రాజెక్టులకు ప్రణాళికలు వేశారు. ఈ పనులు ఎలా సాగుతున్నాయి? ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి? తదితర అంశాలపై ఈటీవీ భారత్ క్షేత్రస్థాయి పరిశీలన కథనం.

SRDP
SRDP

By

Published : Jan 17, 2022, 5:37 AM IST


SRDP PROJECTS: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేలా... రాష్ట్ర ప్రభుత్వం ఎస్​ఆర్​డీపీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు చేపట్టింది. రెండో దశలో 43 ప్రాజెక్టుల్లో ఇప్పటికి 23 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 11 పైవంతెనలు, 4 అండర్‌పాస్‌లు, 5 ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, తీగలవంతెన, చిన్నపాటి ఉక్కు వంతెన అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 20 ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. 14 పైవంతెనలు, 2 అండర్ పాస్‌లు, 4 ఆర్వోబీ, ఆర్‌యూబీల నిర్మాణాలు చేయాల్సిఉంది.

నేటికీ కొనసాగుతున్న పనులు...

బొటానికల్‌ గార్డెన్‌- కొండాపూర్‌ ఆర్టీఓ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు... 2017లో ప్రారంభంకాగా నేటికీ కొనసాగుతున్నాయి. రూ. 263 కోట్లతో ఆ నిర్మాణం చేపట్టారు. 2022 మార్చిలో వంతెన నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది త్వరగా పూర్తైతే మియాపూర్‌- గచ్చిబౌలి మార్గంలో ప్రయాణించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

వీఎస్టీ నుంచి ఇందిరాపార్కు వరకు 2.6కిలోమీటర్ల మేర... రూ. 400కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఏడాది క్రితం పనులు ప్రారంభించగా మరో ఆర్నెళ్ల వరకి సాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇది త్వరగా పూర్తిచేస్తే వీఎస్టీ, రామ్‌నగర్‌ ప్రయాణికులకు సాఫీగా ప్రయాణం సాగుతుంది.

పూర్తి కావాల్సిన పనులు..

ఆరాంఘర్‌- శంషాబాద్‌ పైవంతెన నిర్మాణం పనులు లక్ష్యానికి వెనకబడ్డాయి. విమానాశ్రయానికి వెళ్లే శంషాబాద్‌ రహదారిని ఎక్స్‌ప్రెస్‌ హైవేగా మార్చాలని... కేంద్రం నిధులు మంజూరు చేసింది. రూ. 283 కోట్లతో వ్యయంతో 10 కిలోమీటర్ల పొడవున పనులు జరుగున్నాయి. 6 లైన్లతో రెండువైపులా సర్వీస్‌రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. 2018లో మొదలైన నిర్మాణపనులు.. 2021 నాటికే పూర్తి కావాల్సిఉండగా... చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్‌ నుంచి జూపార్కువరకు నిర్మించే పైవంతెనతో ఎంజీబీఎస్ నుంచి బెంగళూరు జాతీయ రహదారికి వాహనాలు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా చేరుకోవచ్చు. రూ. 69 కోట్లతో 900 మీటర్లు పొడవునా నిర్మిస్తున్నారు. 2018లో మొదలైన పనులు 2022 మార్చిలో పూర్తికావాల్సి ఉండగా... నిర్దేశిత గడువులోనే పూర్తయ్యే అవకాశాలున్నాయి.

మరో రెండుమూడు నెలలు..

చింతలకుంట చెక్‌పోస్టు, ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ రూ. 43 కోట్లతో 940 మీటర్ల పొడవునా ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నారు. 2017లో మొదలు కాగా 2022 మార్చినాటికి పూర్తి కావాల్సి ఉండగా రెండు మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details