హైదరాబాద్‌కు చెందిన హెటెరో గ్రూపు, రష్యాకు చెందిన కొవిడ్-19 టీకా ‘స్పుత్నిక్ వి’ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ టీకాను ఉత్పత్తి చేసి, మన దేశంతో పాటు ఇతర దేశాలకు అందించడానికి రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌తో హెటెరో గ్రూపు కొంతకాలం క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి ఒప్పందాలను ఆర్‌డీఐఎఫ్ మన దేశానికి చెందిన 6 ఫార్మా కంపెనీలతో కుదుర్చుకుంది. వాటిలో హెటెరో గ్రూపు ఒకటి.
ఇందులో భాగంగా హెటెరో సంస్థకు ఆర్‌డీఐఎఫ్ నుంచి స్పుత్నిక్-వి టీకా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయింది. దీంతో ‘స్పుత్నిక్ వి’ టీకా ఉత్పత్తి మొదలుపెట్టినట్లు హెటెరో గ్రూపు ఛైర్మన్ బి.పార్థసారథిరెడ్డి తెలిపారు. స్పుత్నిక్-వి టీకాను ఉత్పత్తి చేస్తున్న కంపెనీల ప్రతినిధులతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు.