రాజధాని రోడ్లపై ద్విచక్ర వాహనాలు 50 కి.మీ. వేగానికి మించి తిరగకూడదు. కానీ...ఇంజిన్ ఆన్ చేసిన నాలుగు సెకన్లకే వంద కి.మీ., ఎనిమిది సెకన్లకు 200 కి.మీ. వేగంతో పరుగెత్తే బైకులు మహానగరంలో వందల సంఖ్యలో ఉన్నాయి. స్పోర్ట్స్ ద్విచక్రవాహనాల(SPORTS BIKES) ఖరీదు కనిష్ఠంగా రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.1.10 కోట్ల వరకు ఉందని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో స్పోర్ట్స్ బైక్‌ల కొనుగోళ్లు ఇతరత్రా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వ్యవహారాలను‘ఈనాడు- ఈటీవీ భారత్’ పరిశీలించినపుడు అనేక విషయాలు వెలుగులోనికి వచ్చాయి.
కొనేది ముంబయిలో.. రిజిస్ట్రేషన్ ఇక్కడ
కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం దేశంలో, విదేశాల్లో తయారైన ద్విచక్ర మోటారు వాహనాలకు ముందుగా కేంద్రం ఆమోదించిన టెస్టింగ్ సెంటర్ నుంచి అనుమతి తీసుకోవాలి. అక్కడి నుంచి అనుమతి వస్తే అధిక ఇంజిన్ అశ్విక సామర్థ్యం (హార్స్‌పవర్) గల స్పోర్ట్స్ ద్విచక్ర వాహనాలను నియంత్రించే అధికారం రవాణాశాఖకు లేదు. అయితే వాహన ఖరీదులో తొమ్మిది శాతం రిజిస్ట్రేషన్ ఛార్జిగా వసూలు చేస్తారు. ఒకరి పేరుతో మరో వాహనం కూడా ఉంటే 14 శాతం పన్ను చెల్లించాలి. రాజధాని పరిధిలో స్పోర్ట్స్ బైక్‌ల వినియోగం బాగా పెరిగింది. కరోనా సమయంలో వీటి కొనుగోళ్లు తగ్గడంతో విదేశీ బైక్‌ల విక్రయ సంస్థలు హైదరాబాద్‌లో షోరూంలను మూసివేశాయి. చాలా స్పోర్ట్స్ బైక్‌లను అనేక మంది ముంబయిలో కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఖరీదైన కార్లు, బైక్‌లను కొనడం సంపన్న వర్గాల పిల్లలకు ఫ్యాషన్‌గా మారింది. ఇటీవల ఓ సినీనటుడు రూ.5 కోట్ల ఖరీదైన కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారును చూసి మోజుపడిన మరో నటుడు ఇదే కారును నెలల వ్యవధిలో కొన్నారు. కొంతమంది సినీనటులు, ప్రముఖుల ఇళ్లలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్‌లు రెండు నుంచి ఆరు వరకు ఉన్నాయని రవాణా అధికారులు చెబుతున్నారు.