Security at HICC: మరో మూడు రోజుల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్,కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొననున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీజీ అధికారులు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు సమావేశం నిర్వహించారు.
హెచ్ఐసీసీలో నిర్వహించిన ఈ సమావేశానికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, సంయుక్త సీపీ అవినాష్ మొహంతి, నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, సీసీఎస్ డీసీపీ కవిత, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు, రహదారులు భవనాల శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖాధికారులు, బీఎస్ఎన్ఎల్ అధికారులు, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు. భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను చర్చించిన తర్వాత... మిగతా శాఖలకు సంబంధించిన పాత్రలను ఎస్పీజీ అధికారులు విశదీకరించారు. ఏయే శాఖాధికారులు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే విషయాలను ఎస్పీజీ అధికారులు నిర్ధేశించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వీవీఐపీలు వచ్చినప్పటి నుంచి.. తిరిగి వెళ్లిపోయే వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ కమిషనరేట్ అధికారులకు ఎస్పీజీ అధికారులు దిశా నిర్దేశం చేశారు. హెచ్ఐసీసీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. నోవాటెల్లో కొంతమంది ప్రముఖులు బస చేయనున్నారు. మరికొంత మందికి వెస్టిన్, రాడిసన్, పంచతార హోటళ్లు కేటాయించారు. ప్రధాని ఎక్కడ బస చేస్తారనే విషయం ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ ఇలా ముఖ్యులందరూ ఒకే చోట కాకుండా భద్రతను దృష్టిలో ఉంచుకొని వేర్వేరు చోట్ల బస ఏర్పాటు చేయాలని ఎస్పీజీ అధికారులు భావిస్తున్నారు.