Amrabad Tiger Sanctuary lab : వన్యప్రాణుల అలవాట్ల విశ్లేషణకు ప్రత్యేక ల్యాబ్
Amrabad Tiger Sanctuary lab : తెలంగాణ అటవీశాఖ అభయారణ్యంలోని మృగాల కోసం క్షేత్రస్థాయి ప్రయోగశాలను ప్రారంభించింది. అమ్రాబాద్ అభయారణ్యంలో కనిపించే అరుదైన జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాల శరీర నమూనాలనూ సేకరించి అవి పాడవకుండా ఇక్కడ భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 350కి పైగా నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
వన్యప్రాణుల అలవాట్ల విశ్లేషణకు ప్రత్యేక ల్యాబ్
By
Published : Dec 5, 2021, 10:03 AM IST
Amrabad Tiger Sanctuary lab :అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో మృగాలు.. వాటి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం, వ్యాధులు ఇతర అంశాలను విశ్లేషించేందుకు తెలంగాణ అటవీశాఖ క్షేత్రస్థాయి ప్రయోగశాలను ప్రారంభించింది. ఈ ఏడాది జులైలో నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు చెక్‌పోస్టు వద్ద దీన్ని ఏర్పాటుచేశారు. అమ్రాబాద్ అభయారణ్యంలో కనిపించే అరుదైన జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాల శరీర నమూనాలనూ సేకరించి అవి పాడవకుండా ఇక్కడ భద్రపరుస్తున్నారు.
క్రూర మృగాలు వేటాడిన జంతువు వెంట్రుకలు, ఎముకలు, కొన్ని శరీర భాగాలు జీర్ణం కాకుండా మలం ద్వారా బయటకు వస్తాయి. ఆ నమూనాను విశ్లేషించడం ద్వారా ఆ మృగాల ఆహారపు అలవాట్లు, అవి ఎక్కువగా వేటాడుతున్న జంతువుల సమాచారం, వాటికున్న రోగాలు, ఏమి తినడం ద్వారా ఏ రోగాల బారిన పడ్డాయో అమ్రాబాద్ ప్రయోగశాలలో తెలుసుకుంటారు. అంతరించిపోతున్న అరుదైన జంతువు మూషిక జింకల సంతతిని అభయారణ్యంలో ప్రత్యేక పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. వాటి కదలికలు ఎలా ఉన్నాయి? అవి ఏ జంతువులకైనా ఆహారంగా మారుతున్నాయా? అనే అంశాన్నీ గమనిస్తున్నారు. ఇప్పటివరకు 350కి పైగా నమూనాలను సేకరించినట్లు ల్యాబొరేటరీ ఇన్‌ఛార్జి, బయాలజిస్ట్ మహేందర్‌రెడ్డి తెలిపారు.
కళేబరాలు భద్రం..
అమ్రాబాద్ అభయారణ్యంలోని జంతువులు, కీటకాలు, సరీసృపాలు, క్షీరదాలు, పక్షుల్ని కోర్ ఏరియాలో మాత్రమే చూడగలం. వాటి కళేబరాలను భద్రపరచడం ద్వారా ప్రయోగశాలలో అందరూ చూసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి అడవుల్లోనే కనిపించే రెండు తలల పాము, గోండ్రు కప్ప, తేళ్లు, సీతాకోక చిలుకల్ని సేకరించి వాటి శరీరం పాడవకుండా ఉంచుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చుక్కల దుప్పి కళేబరానికి పరీక్ష నిర్వహిస్తుండగా దాని గర్భంలో మూడు నెలల పిండం బయటపడింది. దానిని అలాగే భద్రపరిచారు. శిక్షణ పొందేవారికి, క్షేత్రస్థాయి పర్యటన కోసం వచ్చే విద్యార్థులకు, పర్యాటకులకు ఈ నమూనాలను చూపించి నల్లమల అభయారణ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. నమూనాల విశ్లేషణ ఫలితాలు భవిష్యత్తులో ఎన్నోరకాలుగా ఉపయోగపడతాయని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఎప్డీవో రోహిత్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు విశ్లేషణలో గుర్తించింది ఇవి..
పులులు ఎక్కువగా సాంబర్ జింకలు, అడవి పందులు, చుక్కల దుప్పులను ఆహారంగా తీసుకుంటున్నాయి.
చిరుతలు సైతం చుక్కల దుప్పులు, కొండముచ్చులు, అడవి పందులను వేటాడుతున్నాయి.