రాష్ట్రంలో పెరుగుతున్న వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గెరిల్లా పోరాటంలో ఆరితేరిన గ్రేహౌండ్స్‌ను బలోపేతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాల్లోని పోలీసులకూ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా అవసరమైన మార్పులు చేపట్టబోతున్నారు.
కొన్ని నెలలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లను అనుకొని ఉన్న జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఒక్కసారిగా పెరగడంతో పోలీసు అధికారులు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణ చర్యల కింద ప్రభావిత ప్రాంతాలకు గ్రేహౌండ్స్ బలగాలను తరలించి విస్తృతంగా గాలింపులు చేపడుతున్నారు. దీనివల్ల మావోయిస్టుల కదలికలు, తద్వారా వారు తలపెట్టే విధ్వంసక చర్యలను అడ్డుకోవచ్చన్నది అధికారుల ఆలోచన. అయితే.. సిబ్బంది కొరత కారణంగా ఇలా నిరంతరం గ్రేహౌండ్స్ బలగాలతో గాలింపులు నిర్వహించడం కష్టం.