నేను ఆ శివుడిలో సగాన్ని... మీరు కొలిచే అమ్మవారిని, శక్తిమాతను. నేను లేకపోతే జగత్తే లేదు. ఈ సృష్టిలో నేను అన్ని చోట్ల ఉండలేను కాబట్టే... జీవితాంతం మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకోవడానికి ఓ ఆడపిల్ల రూపంలో ఉన్న నా ప్రతిరూపాలను మీకు కానుకగా ఇస్తున్నాను. ఓ తల్లిగా, భార్యగా, కూతురిగా వారు మీకు అన్ని రూపాల్లో తోడుంటూ మిమ్మల్ని చూసుకుంటున్నారు. కానీ... మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల వారు అత్యాచారాలకు గురవుతూ.. అన్యాయంగా చనిపోతున్నారు. మీ కోసం నేను పంపిన నా ప్రతిరూపాలను... చీమలుగా నలిపి, రాక్షసానందం పొందతూ వారికి బతికుండగానే నరకం చూపించి నాకే కానుకగా తిరిగి పంపుతున్నారు. వారిని చూడలేక, నాలో నేను నలిగిపోతూ... నేనూ ఓ ఆడదాన్ననే విషయం గుర్తొచ్చి... ఈ సృష్టిపైనే అసహ్యమేస్తోంది.
సృష్టినే నాశనం చేయాలనిపిస్తోంది...
నాకీ బాధ తప్పాలంటే... నేను ఈ సృష్టినైనా నాశనం చేయాలి. లేదా మీలో మార్పు అయినా తీసుకురావాలి. మీలో మార్పు రావడం చాలా కష్టమనిపిస్తోంది. కానీ తప్పు చేసే కొందరి కోసం అందరినీ నాశనం చేయలేకపోతున్నాను. అందుకే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయి పుట్టగానే ఆమె చదువు, పెళ్లి గురించి కాకుండా తన కాళ్లపై తాను బతకగలిగేలా చేయాలి. మన పద్ధతులు, సంప్రదాయాలు, పనులు నేర్పినట్లుగానే వారిని వారు కాపాడుకోవడం నేర్పించాలి. మూడేళ్ల నుంచే బడికి పంపినట్లుగా కరాటే వంటి తరగతులకు పంపాలి. నేటి సమాజంలో చదువు ఎంత ముఖ్యమో ఆడపిల్లకు తనని తాను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం.