హైదరాబాద్ నగరాన్ని ప్రమాద రహిత నగరం తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, రహదారులు భవనాల శాఖ సహకారంతో క్షేత్ర స్థాయిలో పలు చర్యలు చేపడుతున్నారు. గతేడాది జరిగిన ప్రమాదాలను బట్టి నగరంలో 60 బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటి వద్ద ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.
106 ప్రమాదాల్లో... 105 మంది మృతి
ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 106 ప్రమాదాలు జరుగగా...105 మంది మృత్యువాత పడ్డారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు అధ్యయనాల్లో తేలింది. దీనితో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులు పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.
వివరాలిలా...
రహదారి ప్రమాదంలో 50 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల పరిశీలనలో తేలింది. ఈ ఏడాది రహదారి ప్రమాదాలు వల్ల జరిగిన 106 మరణాల్లో 53 మంది ద్విచక్ర వాహనదారులు, 13 మంది ద్విచక్ర వాహనం వెనకాల కూర్చున్న వాళ్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
ఒకవేళ శిరస్త్రాణం ధరించి ప్రయాణిస్తే ప్రమాదం జరిగిన కేవలం గాయాలతో బయటపడొచ్చని ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్నా... చాలామంది పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ నిబంధనలను పెడచెవిన పెడుతూ ద్విచక్ర వాహనదారులు యథేచ్ఛగా రహదారులపై తిరుగుతున్నారు.
దీనితో ట్రాఫిక్ పోలీసులు శిరస్త్రాణం లేకుండా ప్రయాణించే వాళ్లకు జరిమానా విధిస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు తమ చేతిలో ఉన్న కెమెరాల్లోనూ ద్విచక్ర వాహనదారులను బందిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కూడా శిరస్త్రాణం లేని వారిని గుర్తించి ఈ చలానా చిరునామాకు పంపిస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 24 లక్షల మందికిపైగా ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. గతేడాది కంటే ఈ సంఖ్య దాదాపు ఐదు లక్షలు ఎక్కువగా ఉండటం గమనార్హం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే ద్విచక్ర వాహనం వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నిబంధన పట్టించుకోని వారిపై జరిమానా వేస్తున్నారు.
శిరస్త్రాణం ధరించడం వల్ల ఒకవేళ ప్రమాదం జరిగినా.. గాయాలతో బయటపడొచ్చని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు