తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2020, 8:08 AM IST

ETV Bharat / state

విశాఖ నౌకాశ్రయం.. 87 వసంతాల సంబురం

​ విశాఖ సహజ నౌకాశ్రయం తూర్పుతీరానికే ఒక మణిహారం. సరకు రవాణాకే కాకుండా రక్షణ పరంగానూ.. దేశంలో మరే మేజర్‌ పోర్టుకూ లేని ప్రత్యేకత దీని సొంతం. విశాఖ మహానగరంగా అభివృద్ధి చెందడంలోనూ పోర్టు పాత్ర అద్వితీయం. విశాఖ పోర్టు 87వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

special story on Visakhapatnam port completed 87 years
special story on Visakhapatnam port completed 87 years

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ సోయగాలను ప్రోదిచేయడంలో కొండలు, సాగర తీరం ఒకదానితో మరోటి పోటీపడుతూనే ఉంటాయి. ఇదే ఇక్కడ సహజ నౌకాశ్రయంగా వినియోగంలోకి రావడానికి కారణమైంది. భీమునిపట్నం.. పోర్టుసిటీగా అనాది నుంచే సుప్రసిద్ధం. డచ్‌ దేశస్థులు భీమిలిని ఆశ్రయంగా చేసుకుంటే... తర్వాత వచ్చిన ఆంగ్లేయులు ఈస్టిండియా కంపెనీకి ఓ శాఖను విశాఖలో ఏర్పాటుచేసుకున్నారు.

నౌకావాణిజ్యానికి భీమునిపట్నం నుంచి క్రమంగా విశాఖ కేంద్రంగా మారింది. జానుస్‌, వెల్‌డన్‌ అనే రెండు నౌకల స్కెలిటన్‌లతో డాల్ఫిన్‌ నోస్‌, రాస్‌ హిల్స్‌ మధ్య ఈ నౌకాశ్రయ నిర్మాణానికి అంకురం పడింది. డబ్యూ.సీ. ఆష్‌, రాటన్‌ బెర్రీ అనే ఇద్దరు ఇంజినీర్ల కృషి ఈనాటి పోర్టుకు రూపకల్పన చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి మేఘాద్రిగడ్డ ముఖద్వారం వద్ద హార్బర్‌ నిర్మాణం చేయాలని సంకల్పించారు. 378 లక్షల రూపాయలను పోర్టు నిర్మాణానికి వెచ్చించారు.

ఎస్‌.ఎస్‌.జలదుర్గ నౌక జలప్రవేశంతో కార్యకలాపాలు ప్రారంభం

ప్రస్తుతం హిందుస్థాన్‌ షిప్‌యార్డుగా వ్యవహరిస్తున్న సింధియా నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించిన ప్రయాణికుల నౌక..ఎస్‌ఎస్‌ జలదుర్గ ఈ పోర్టు నుంచి జలప్రవేశం చేయడంతో పోర్టు కార్యకలాపాలు ఆరంభమమయ్యాయి. అక్టోబర్‌ 7, 1933న ఈ పోర్టు ప్రారంభమైంది. అప్పటి నుంచి అక్టోబర్‌ 7న పోర్టు వ్యవస్థాపక దినాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. 1933 డిసెంబర్‌ 19న అప్పటి వైస్రాయ్‌, గవర్నర్‌ జనరల్‌ వెల్లింగ్‌టన్‌ ఈ పోర్టును లాంఛనంగా ప్రారంభించారు. 3 బెర్త్‌లతో తొలి ఏడాది 1.2 లక్షల టన్నుల సరకు రవాణా ఈ పోర్టు ద్వారా సాగింది. ఇందులో 1.1 లక్షల టన్నుల సరకులు ఎగుమతి కాగా.... మిగిలినది దిగుమతి.

రెండో ప్రపంచయుద్ధ కాలంలో ప్రధాన భూమిక

రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఈ పోర్టు రక్షణ వ్యూహాల పరంగా అత్యంత కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం తర్వాత పంచవర్ష ప్రణాళికల ద్వారా వచ్చిన నిధులతో పోర్టు అభివృద్ధి వేగంగానే సాగింది. పోర్టులో ప్రధానంగా.... ఇన్నర్, అవుటర్, ఫిషింగ్‌ హార్బర్‌లు ఉన్నాయి. అవుటర్ హార్బర్‌ 200 హెక్టార్‌లలో ఆరు బెర్తులు ఉన్నాయి. ఇన్నర్‌ హార్బర్‌లో వంద హెక్టార్‌లలో 18 బెర్తులు ఉన్నాయి. మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఫిషింగ్‌ హార్బర్‌ వినియోగంలో ఉంది.

నౌకావాణిజ్యానికి కేంద్రం

తొలి ఏడాది లక్ష టన్నుల సరకు రవాణా చేసిన ఈ పోర్టు ఏ యేటికాయేడు సామర్థ్యాన్ని పెంచుకుంటూ.. గత ఆర్థిక సంవత్సరంలో 72.72 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరకు హ్యాండిల్‌ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. తీవ్ర పోటీని తట్టుకుంటూనే.. కొత్త లక్ష్యాలను అందుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. విశాఖ పోర్టులో పలు అభివృద్ధి పనులు ప్రస్తుతం నిరంతరాయంగా సాగుతున్నాయి. 633 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కంటైనర్‌ టెర్మినల్‌ విస్తరణ పూర్తయితే... మరో 5.4 లక్షల టన్నుల సరకు రవాణా పెరగనుంది. ఓర్​1, ఓర్​2 బెర్తుల వల్ల అదనంగా ఆయిల్‌ హ్యాండిల్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. ఆధునికీకరణ పూర్తయితే ఈ టెర్మినల్‌ ద్వారా 80వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఆయిల్‌ ట్యాంకర్లను నిర్వహించే అవకాశం దక్కుతుంది. 77 కోట్ల రూపాయల ఖర్చుతో జరుగుతున్న క్రూయిజ్‌ టెర్మినల్‌ అభివృద్ధి వల్ల... విహార ఓడలు వచ్చేందుకు సదుపాయమేర్పడుతుంది.

విశాఖ పోర్టు.... తనకు కావాల్సిన విద్యుత్‌ను సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా... మిగులు విద్యుత్‌ను పవర్‌గ్రిడ్‌కు అనుసంధానించి ఆదాయం సైతం పొందుతోంది.

ABOUT THE AUTHOR

...view details