తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ (telangana state congress ) నాయకుల మధ్య విబేధాలు చిలికి చిలికి గాలివానలా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీని వీడడంతో... ప్రతిపక్ష హోదాను కూడా కాంగ్రెస్ కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేనిలో కూడా ఫలితాలు ఆశించిన మేర రాలేదు. నాయకుల మధ్య విభేదాలు... పార్టీని బలోపేతం చేసేందుకు చేసే కార్యక్రమాల కంటే... ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ హైకమాండ్‌కు లేఖలు రాసుకోవడంలో ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. బయటకు అంతా సవ్యంగా ఉన్నట్లు కనిపించినా... నివురుగప్పినా నిప్పులా నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయి. పార్టీపరంగా తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు చొరవ చూపరు కానీ... తీసుకున్న నిర్ణయాలపై లోపాలను ఎత్తి చూపేందుకు ఎక్కువ మక్కువ చూపుతారనే ప్రచారం జరుగుతుంది. ఆయా కారణాలతో పార్టీ ఒక అడుగు ముందుకు... నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
ఎప్పుడూ లేనిది.. ఇప్పుడే ఎందుకు..
వరుస ఓటమిలు చవిచూసినప్పటికీ...సమీక్షలు ఉండేవి కావు. కానీ పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy) పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నిక హూజూరాబాద్ (huzurabad by election). ఇక్కడ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అధిష్ఠానం ఆదేశాలతోనే కొనసాగాయి. అయినా హుజూరాబాద్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. ఈ పరాజయానికి బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి... ఫలితాలు వచ్చిన వెంటనే ప్రకటించారు. ఫలితాలు తమను బాధించాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి...లోటుపాట్లను సవరించుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించి అందులో కూడా ఇదే అంశంపై సమీక్ష కూడా చేశారు.
అక్కడా.. అదే తీరు
అయినా కూడా కొందరు సీనియర్ నాయకులు సోనియాగాంధీకి (Sonia Gandhi) లేఖ రాసి...కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిర్ధిష్టమైన ఓటు కూడా పార్టీకి రాలేదని... దీనిపై సమీక్ష నిర్వహించాలని కోరారు. దీంతో శనివారం రోజున... దిల్లీలో అధిష్ఠానం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలోనూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీలో ఐక్యత ఎంత మేర ఉన్నదనేది బహిర్గతమవుతోంది.