TRS Vs BJP: సై అంటే.. సై.. మాటకు మాట.. ట్వీట్‌కు ట్వీట్.. దేనికైనా రెడీ అన్నట్లుగా భాజపా-తెరాస మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ అవతరణ, కొత్త రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలతో పాటు పెద్దగా రాజకీయ వైరానికి దిగిన ఘటనలు లేవు. సీఎం కేసీఆర్ కేంద్రానికి అంశాలవారీగాను మద్దతు తెలిపారు. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత దూరం మరింత పెరుగుతోంది. గులాబీ పార్టీకి చేదు గుళిక రుచిచూపించిన కమలనాథులు క్రమంగా పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగిన సీట్లు రాబట్టి తెరాసకు ముచ్చెమటలు పట్టించారు. ఆ తర్వాత హుజూర్నగర్ ఉపఎన్నికలో పరాభవం చవిచూసినప్పటికీ.. పడిలేచిన కెరటంలా పైకిలేచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉపఎన్నిక రావడం.. ఈటల రాజేందర్ వంటి బలమైన నాయకుడు భాజపా తీర్థం పుచ్చుకోవడంతో కమలనాథుల్లో జోష్ మరింత పెంచింది. తెరాస ప్రభుత్వం అస్త్రశస్త్రాలెన్ని వాడినా ఈటల జయకేతనం ఎగురవేయడం భాజపా నేతల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. ఇదే ఊపును వచ్చే ఎన్నికల నాటికీ కొనసాగించాలని భావిస్తున్న భాజపా అధిష్టానం.. తెరాస సర్కార్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు రాష్ట్ర నేతలకు పచ్చజెండా ఊపింది.
అక్కడ మొదలైన మాటల వేడి...
telangana politics: వరిధాన్యంతో మొదలైన మాటల వేడి ఉద్యోగుల బదిలీలు, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యల వంటి అంశాలతో మరింత వేడెక్కింది. ధాన్యం సేకరణ అంశంపై దాదాపు నెలకుపైగా హైడ్రామా నడిచింది. రాష్ట్ర మంత్రులు దిల్లీకి వెళ్లడం.. పోటాపోటీగా రాష్ట్ర భాజపా నేతలు కేంద్రమంత్రి పీయూశ్ గోయల్‌ను కలవడం వాతావరణాన్ని మరింత కాక పుట్టించాయి. కేంద్రం తీరును ఎండగట్టే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇందిరాపార్క్ వద్ద వరిదీక్షకు దిగడం.. ఆ తర్వాత ఊరూరా భాజపాకు చావు డప్పు మోగించడం మరింత మంటపుట్టించాయి. ఈ పరిణామాలన్నీ దిల్లీకి చేరాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్ సహా ముఖ్యనేతలు.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాష్ట్రంలో పరిస్థితులు తెలిపారు. వివరాలన్నీ తెలుసుకున్న నడ్డా.. తెరాస సర్కార్‌పై చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. ఇదే ఉత్సాహంతో ఎదుర్కోవాలని సూచించారు. బండి సంజయ్ పాదయాత్రను అభినందిస్తూ అలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఉద్భోదించారు. అవసరమైతే తాను కూడా రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. అమిత్ షా సైతం రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పోరాడాలని భాజపా నేతలకు దిశానిర్దేశం చేశారు. అధిష్టానం సంకేతాలతో రంగంలోకి దిగిన భాజపా నేతలు ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు, నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలపై పోరాటాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్లో బండి సంజయ్ జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరు భాజపాకు తీవ్ర అగ్రహం తెప్పించింది. పార్టీ కార్యాలయం తలుపులు బద్ధలు కొట్టి సంజయ్‌ను అరెస్ట్ చేయడం కమలనాథులకు ఆక్రోషం తెప్పించింది.
బండి దీక్ష భగ్నం.. మరింత ముదిరిన లొల్లి
Bandi sanjay arrest: బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించడం.. ఆ తర్వాత పరిణామాలపై ఆరా తీసిన భాజపా అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. 14 రోజుల పాటు నిరసన చేపట్టాలనే నిర్ణయంలో భాగంగా.. జేపీ నడ్డా స్వయంగా హైదరాబాద్‌కు వచ్చారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.కొవిడ్ ఆంక్షల దృష్టి అనుమతి నిరాకరించిన పోలీసులు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చర్యలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలోనే జేపీ నడ్డాను నిలువరించే ప్రయత్నం చేశారు. కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తానని.. హామీ ఇచ్చిన నడ్డా తన పంతం నెగ్గించుకున్నారు. నడ్డాను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల నడుమ కమలదళాధిపతి సికింద్రాబాద్‌కు వెళ్లి గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.