తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగారు తెలంగాణ దిశగా.. పచ్చని మాగాణియే లక్ష్యం - news on state irrigation projects

గతానికి.. ప్రస్తుతానికి ఎంత తేడా! ఒకప్పుడు నీళ్లున్నా వాడుకోలేని స్థితిలో ఉంటే, ప్రస్తుతం ప్రతిబొట్టూ మన సొంతం. సీమాంధ్ర నాయకత్వంలో రాష్ట్రానికి నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే.. స్వరాష్ట్రంలో ప్రతిచుక్కను సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నీరు పల్లమెరుగును అని సీమాంధ్ర పాలకులంటే.. అదే నీరు పైకి కూడా ఎగురునని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది.

special story on telangana irrigation projects
పచ్చని మాగాణియే లక్ష్యం

By

Published : Jun 2, 2020, 12:45 PM IST

బంగారు తెలంగాణ దిశగా..

నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్ష నెరవేరి ఏర్పడిన తెలంగాణలో తెరాస ప్రభుత్వం... నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని మొదట నిర్దేశించుకున్నా... తర్వాత ఆ లక్ష్యాన్ని కోటి పాతిక లక్షల ఎకరాలకు పెంచింది. ఇందుకోసం నాలుగంచెల వ్యూహంతో ముందుకెళ్తోంది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల పునరాకృతి, శిథిలమైన పాత ప్రాజెక్టుల ఆధునీకరణ, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ ఇందులో ఉన్న అంశాలు.

పూర్వ వైభవం..

మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ చేపట్టిన సర్కారు... 4 దశల్లో రూ. 4,352 కోట్లు ఖర్చు చేసి 26 వేల 690 చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చినట్లు తెలిపింది. తద్వారా 50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం పెరిగి 15 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు స్థిరీకరించినట్లు పేర్కొంది. మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలమట్టం పెరగడం వల్ల పంటల దిగుబడి, చేపల ఉత్పత్తి కూడా పెరిగింది.

కరవు నుంచి..

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించిన ప్రభుత్వం పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల ఆయకట్టు భారీగా పెరిగింది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో 20 లక్షల ఎకరాలకు నీరందుతోందని సర్కారు తెలిపింది. భక్త రామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను రికార్డు సమయంలో పూర్తి చేసి నీరందించారు.

ఇంజినీరింగ్ అద్భుతం..

రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల పునరాకృతికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం... మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఇంజినీరింగ్ అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోన్న కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే పూర్తి చేసి దశల వారీగా నీటిని ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డ ఎగువన ఉన్న లక్ష్మి పంప్ హౌజ్ ద్వారా 60.5 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. సరస్వతి ద్వారా 55, పార్వతి నుంచి 53 టీఎంసీల నీటిని ఎగువకు తరలించారు. నంది పంప్​హౌజ్ ద్వారా 68, గాయత్రి పంప్​హౌజ్ నుంచి 66 టీఎంసీలు సహా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి లింక్​లో 303 టీఎంసీల నీటి ఎత్తిపోతలు జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పైకెగిన గోదారమ్మ..

రెండో లింక్​లోనూ.. పనులు పూర్తి కావడం వల్ల అన్నపూర్ణ, రంగనాయకసాగర్​తోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ఎత్తులో ఉన్న జలాశయం కొండపోచమ్మ సాగర్​కు కూడా గోదావరి జలాలు చేరాయి. ప్రాజెక్టులో చివరిదైన, పదో దశ ఎత్తిపోతల కూడా పూర్తవడం వల్ల గోదావరి జలాలను 530 మీటర్ల ఎత్తుకు తరలించినట్లైంది. కాళేశ్వరం ద్వారా 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పనులు పూర్తి కాగా... మరో టీఎంసీని తరలించేందుకు వీలుగా పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా బడ్జెట్​లో రూ. 250 కోట్లను కేటాయించారు.

వరదకాల్వే జలాశయంగా..

శ్రీరాంసాగర్​కు నీటిప్రవాహం లేని సమయంలో ఇబ్బంది లేకుండా ఉండేలా శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకాన్ని చేపట్టారు. కాళేశ్వరం జలాలను ఉపయోగించుకొని వరదకాల్వనే జలాశయంగా మార్చి ఎస్సారెస్పీలోకి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేశారు. దేవాదుల ఎత్తిపోతలకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం నీటి లభ్యత ఉండేలా తుపాకులగూడెం వద్ద వనదేవత సమ్మక్క పేరిట ఆనకట్ట నిర్మిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడున్నర లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు మరో మూడన్నర లక్షల ఎకరాల స్థిరీకరణ కోసం సీతారామ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.

విద్యుత్​ ఉత్పత్తి..

గోదావరిపై విద్యుత్ ఉత్పత్తి కోసం 37 టీఎంసీల నిల్వ, 320 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ ఆనకట్టను నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చెరువుల్లో నిత్యం నీరు ఉండేలా ప్రాజెక్టులతో అనుసంధానించే పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 1,200 చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. తద్వారా వాగులు, వంకల్లో సుమారు 15 టీఎంసీల నీటిని నిల్వ చేసి పంటపొలాలకు నీరందించాలన్నది సర్కార్​ లక్ష్యం.

భారీగా నిధులు..

సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి భారీగా నిధులు ఖర్చు చేశామన్న ప్రభుత్వం... 2019- 20 బడ్జెట్​లో రూ. 8,076 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. 2020 వరకు రాష్ట్రంలో 80 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతోందని, ప్రాజెక్టులన్నీ పూర్తైతే 53 లక్షల కొత్త ఆయకట్టుతో పాటు మరో 25 లక్షల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందని ప్రభుత్వం చెప్తోంది.

ఇవీ చూడండి:'తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం'

ABOUT THE AUTHOR

...view details