Teachers Day 2022: పరుసవేది కంటే గురువు ఘనుడు. పరుసవేది తన స్పర్శతో ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగలదంటారు. అది మరొక పరుసవేదిని సృష్టించలేదు. కానీ, ఒక గురువు మరొక గురువును తయారు చేయగలడు. భార్యా పుత్ర బంధు మిత్ర ధన సంపద ఉన్నా, పూర్తి వైరాగ్యభావనలు ఉన్నా గురుపాదాలను ఆశ్రయించకపోతే నిష్ప్రయోజనం అంటారు శంకరాచార్య. గురు కటాక్షం ఉంటే సర్వం కరతలామలకమే. గురువు ఒక మాటతో, ఒక స్పర్శతో, ఒక చూపుతో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చి శిష్యుడి సందేహాలను పటాపంచలు చేయగలడు. రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఒక్క స్పర్శతో ఎవ్వరికీ ఇవ్వని ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రసాదించారు. దేవుడి గురించి సంశయాలను పూర్తిగా తొలగించారు.
వేదవ్యాసుడు సాక్షాత్ నారాయణ స్వరూపులు. వేద విభాగం చేసి, బ్రహ్మసూత్రాలను, పురాణ ఇతిహాసాలను అందించిన మహా రుషి. నేడు ఎవరు ఏది వచించినా రచించినా అది అంతా వ్యాసభగవానుడి నోటినుంచి వెలు వడినదే అనేది నానుడి. వేద విజ్ఞానం దైవాల నుంచి రుషులకు, రుషుల నుంచి మానవులకు, గురు పరంపర ద్వారా కొనసాగుతూ వస్తోంది. అందుకే, గురు పరంపరకు అభివాదం చేసి దైవప్రార్థన చేస్తాం. ప్రార్థనలో వ్యాసుణ్ని, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన ఆదిశంకరాచార్యుణ్ని కూడా స్మరించుకుంటాం.