ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ జూనియర్ 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో పాల్గొన్న సురభి భరద్వాజ్ వెండి పతకం సాధించి భారత్‌కు కీర్తిని తీసుకొచ్చింది. ఆడిన మొట్టమొదటి ఆటలోనే ప్రపంచకప్‌లోనే పతకం సాధించి అందరి మన్ననలు పొందుతోందీ యువ షూటర్. సురభి భరద్వాజ్... వయసు 20 ఏళ్లే అయినప్పటికి.... తను ఆడే ఆటలో బుల్లెట్టులాగే దూసుకెళ్తోంది. ఎన్‌సీసీ రోజుల్లో రైఫిల్‌పై ఆసక్తి కలిగి ఈ క్రీడలోకి అడుగు పెట్టింది. తన సోదరి కూడా రైఫిల్ షూటరే అయినప్పటికీ.... కుటుంబంలోని ఆర్థిక సమస్యలతో ఆమె ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. కానీ ఈ అమ్మాయి మాత్రం ఆటను కొనసాగిస్తూ రైఫిల్ షూటింగ్‌లో ప్రపంచ స్థాయిలో రాణించడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ మూడో సంవత్సరం చదువుతున్న సురభి. ఓ వైపు చదువును కొనసాగిస్తూనే.... తనకు ఇష్టమైన షూటింగ్‌లోనూ రాణిస్తోంది. 2015 దిల్లిలో జరిగిన జాతీయ స్థాయి ఎన్‌సీసీ షూటింగ్ పోటీల్లో 50మీటర్ల రైఫిల్ విభాగంలో రజతం గెలుచుకుంది. అత్యంత ఖరీదైన రైఫిల్ షూటింగ్.... ఖర్చులు భరించలేక సురభి తల్లిదండ్రులు ఆటను వదులుకోమన్నారు. కానీ వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకూడదని భావించిన సురభి.…. గన్ ఫర్ గ్లోరీ అకాడమీ వారి సాయంతో శిక్షణను కొనసాగిస్తుంది. ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత కూడా గన్ ఫర్ గ్లోరీ అకాడమీ వారు... తదుపరి ఏడాదికి కావాల్సిన ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు.