సునీతకి పెళ్లై మూడు నెలలైంది. భర్త బెంగళూరులోని పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. ఓ కారు యాక్సిడెంటులో అతను చనిపోయిన తర్వాత ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. తల్లిదండ్రులు పెద్దవాళ్లు. వాళ్లపై ఆధారపడలేని పరిస్థితి. ఆ సమయంలో ఏపీ రాయదుర్గంలోని టెక్స్‌టైల్ పార్కు ఆమెకి పుట్టింటిలా ఆశ్రయమిచ్చింది. అమ్మలా అక్కున చేర్చుకుంది.
నాగమణెమ్మకి ఐదుగురు చెల్లెళ్లు. ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆర్థికంగా ఏ అండా లేని ఆమె దుస్తుల పరిశ్రమలో చేరి కుమారుడిని చదివించుకుంటూ చెల్లెళ్లకు పెళ్లిళ్లూ చేసింది.
రాయదుర్గానికి చెందిన వాల్మీకి లక్ష్మి కొన్నేళ్లక్రితం కటింగ్ మాస్టర్‌గా తన జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఓ దుస్తుల కంపెనీకి యజమాని. ఆమె దగ్గర ఇరవైమంది మహిళలు పనిచేస్తున్నారు. ఏడాదికి రూ.15 లక్షల రూపాయల వ్యాపారం చేస్తోంది.
సునీత, లక్ష్మి, నాగమణెమ్మల మాదిరిగానే రాయదుర్గం, అనంతపురం ప్రాంతాల్లోని పదివేలమందికిపైగా మహిళలకు జీన్స్ దుస్తుల తయారీ ఓ నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఉండే వర్షాభావ పరిస్థితులు, కరవు కాటకాలు వారిని వ్యవసాయేతర ఉపాధివైపు మొగ్గుచూపేలా చేశాయి. అదే సమయంలో ఇక్కడి టెక్స్‌టైల్‌పార్క్, ఇతర దుస్తుల పరిశ్రమలు వలసలని అడ్డుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. దీనికి ప్రభుత్వ సహకారం కూడా తోడవ్వడంతో మహిళలు జీన్స్ తయారీలో రాణించడం మొదలుపెట్టారు. ఐఎస్‌డీఎస్, టాటా ట్రస్ట్, స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన శిక్షణను అందిపుచ్చుకుని స్వావలంబన పొందుతున్నారు.
నేటి యువతరం అభిరుచులకు తగ్గట్లు రకరకాల ఆకృతులతో దుస్తుల తయారీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. కుట్టుపనితోపాటు కత్తిరింపు, గుండీలు, ఫినిషింగ్, ప్యాకింగ్ విభాగాల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకుంటున్నారు. టెక్స్‌టైల్ పార్కులోనూ, పరిశ్రమలకు కూడా ఈ మహిళలు సామూహికంగా దుస్తులు తయారుచేస్తున్నారు. మరికొందరు వస్త్ర యజమానులు అందించిన అధునాతన యంత్రాలతో ఇళ్లలోనే కుడుతున్నారు. ఇంకొందరైతే మరో అడుగు ముందుకు వేసి మార్కెటింగ్‌లో కూడా రాణిస్తున్నారు.
మహారాష్ట్ర, గోవాకు ఎగుమతులు...
నవతరానికి నచ్చేట్టుగా మార్పును ఆహ్వానించడంతో.. ఇక్కడి మహిళలు తయారుచేసిన జీన్స్ దుస్తులకు దేశమంతటా డిమాండ్ పెరుగుతోంది. జీన్స్ కార్గో, పెన్సిల్ కట్, బూట్‌కట్, స్ట్రెచ్ తదితర జీన్స్ రకాలకి పెయింటింగ్, ఎంబ్రాయిడరీలతో కొత్తందాలు తీసుకొస్తున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష,్ట్ర గోవా ప్రాంతాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన ఈ పరిశ్రమలో మహిళలు దూసుకుపోతున్నారు. కొందరు కార్మికులుగా ఉపాధిపొందుతూ ఉంటే మరికొందరు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల ప్రోత్సాహాన్ని అందుకుంటూ వ్యాపారులుగా రాణిస్తున్నారు.