తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పల్లె రోజురోజుకూ కరిగిపోతోంది... నదిలో కొట్టుకుపోతోంది! - ap news

ఏపీలో కృష్ణానది పరివాహకంగా ఉన్న ఆ గ్రామం.. క్రమంగా నీట మునుగుతోంది. వరద నీటి ఉద్ధృతి ఎక్కువైనప్పుడు భూమి కోతకు గురవుతూ.. నది ముందుకు వస్తోంది. దీంతో సమీపంలోని ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. క్రమంగా ఇళ్లు అదృశ్యమవుతూ.. గ్రామమే కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు.

patha-edlalanka-villagers
నదిలో కొట్టుకుపోతున్న ఊరు

By

Published : Aug 12, 2021, 7:37 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక గ్రామం చుట్టూ కృష్ణానది ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో 400 కుటుంబాలు నివసిస్తుండగా.. 2 వేల ఎకరాలు సాగుభుమి ఉంది. కృష్ణానదికి వచ్చే ఆటుపోట్ల కారణంగా నది తీరం కోతకు గురవుతోంది. వరదలు రావడం.. నీటి వేగం ఎక్కువై.. ఇళ్లు సైతం కుప్పకూలి నీట మునుగుతున్నాయి. దీంతో నది ఒడ్డున నివాసం ఉండేవారు ఏ సమయంలో తమ ఇల్లు నదిలో కలసిపోతుందోనని భయంతో బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు. క్రాస్ బండ్, రివిట్​మెంట్ కట్టిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు 30 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారు.

నదిలో కొట్టుకుపోతున్న ఊరు

రాకపోకలకు అంతరాయం..

మరోవైపు గ్రామానికి వెళ్లటానికి కృష్ణానది పాయపై సుమారు 500 మీటర్ల దూరం వంతెన నిర్మాణం చేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాత్కాలికంగా ఇసుకతో నిర్మించిన కాజ్​వే.. వరద నీరు వస్తే కొట్టుకుపోతుంది. ఈ సమయంలో నీటిలోకి దిగి ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు అవనిగడ్డలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని.. ఈ క్రమంలో పశుపక్ష్యాదులను ఊరిలో వదిలేసి.. రావాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఆ ముగజీవాలు.. నీరు, ఆహారం లేకపోవడంతో మృతి చెందుతున్నాయని వాపోయారు.

పట్టించుకోని అధికారులు..

మరోవైపు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని.. దీంతో తీరం మరింత కోతకు గురవుతుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. కాజ్​వే స్థానంలో వంతెన నిర్మాణం చేపట్టాలని ఎడ్లలంక గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నది ఆటుపోట్లుకు భూమి కోతకు గురవ్వకుండా.. క్రాస్ బండ్​ నిర్మించాలని విన్నవించారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఇదీ చదవండీ..YS Viveka Murder Case : వైఎస్​ వివేకా హత్య కేసు.. దూకుడు పెంచిన సీబీఐ

ABOUT THE AUTHOR

...view details