సూర్యుడు ఒక ఏడాదిలో జ్యోతిర్మండలంలోని పన్నెండు రాసులలోకి ప్రవేశిస్తాడు. ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి ఏర్పడుతుంది. సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయాన్ని శుభప్రదంగా, అభ్యుదయ కారకంగా భావించడమే పండుగ.
మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం అనే ఆరు రాసులలో సూర్య సంచారం ఉండే కాలం ఉత్తరాయణం. ఇది దేవతలకు పగలు. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు... ఈ ఆరు రాసులలో సూర్యుడు సంచరించే కాలం దక్షిణాయనం. ఇది దేవతలకు రాత్రి. ఇలా రెండుగా జరిగే కాలవిభజనలో దేవతలు మేల్కొని ఉండే ఉత్తరాయణ కాలాన్ని పుణ్యప్రదంగా, శుభదాయకంగా మానవాళి నమ్మిన కారణంగా - సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే పవిత్ర దినమైన ‘మకర సంక్రాంతి’ పెద్ద పండుగగా అవతరించింది.
లోకంలో జీవించి ఉన్నవారికే కాకుండా, మరణించిన వారికి కూడా ఈ పుణ్యదినం ఉత్తమ లోకాలను ప్రసాదిస్తుందని ధర్మ శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ఈ పండుగ నాడు పితృదేవతల ప్రీతికోసం నువ్వులు దానం చేయడం సంప్రదాయం. నువ్వుల్లో ఉండే ఉష్ణకారక గుణం చలికాలంలో దేహరక్షణకు తోడ్పడుతుందని అందరి నమ్మకం. నువ్వులతోపాటు, వేడిని పుట్టించే నెయ్యిని, కంబళ్లను (గొంగళ్లను) దానం చేయడం ఈ పండుగలోని ప్రత్యేకత. ఈ రోజు చక్కెరతో కలిపిన నువ్వులను తింటే ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని విశ్వాసం.
ముచ్చటగా మూడుదినాల పండుగ ఇది. భోగి అంటే భోగాలకు నిలయం. ఇష్టదేవతలను పూజించి, అనుగ్రహాన్ని పొందడం భోగం. భోగం అంటే ఉత్తమయోగం. భోగిమంటలు వేయడంలోని ఆంతర్యం జీవితం వెలుగుతూ ఉండాలని ఆశించడమే. చెడును కాల్చివేసి, మంచిని వెలిగించడమే భోగి. పాడిపంటల సమృద్ధికి మూలమైన గో, పశుసంపదను, వ్యవసాయాధార సామగ్రిని, ధాన్యాన్ని పూజించి, వైభవాన్ని ప్రదర్శించే పండుగ ‘కనుమ’.