హైదరాబాద్ జంట నగరాల్లోని చెరువులు ఒకప్పుడు గ్రేటర్‌కు ముఖ్య నీటి వనరులు. కానీ నేడు నగరంలోని ఒక్క చెరువూ నాటిలా లేదు. చాలా ఏరియాల్లో స్థానికులే కబ్జాలకు పాల్పడ్డారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ దాటి చెరువుల్లోనే ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేరు. ఉన్నదానిలోనూ పూడికతీయక గుర్రపు డెక్కలు, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఆక్రమణలకు గురికావడంతో తూములు మూసుకుపోయాయి. వాటి పరిధిలోని కాలువలూ నామారూపాలు లేకుండా పోయాయి. కొన్ని కాలువల్లో ఇళ్లు నిర్మించుకున్నారు.
చిన్నబోయింది ఇలా...
నగరంలోని బాలాపూర్ గుర్రం చెరువు మొత్తం 39 ఎకరాల 2 గుంటలు. కానీ నేడు 17 ఎకరాలు కబ్జాకు గురై కేవలం 22 ఎకరాల 2 గుంటలు మాత్రమే మిగిలి ఉంది. ఏళ్ల నుంచి చెరువుల్లోనే ఇళ్లు నిర్మించుకోవడం వల్ల తగ్గుతూ... కేవలం సగమే మిగిలి ఉంది. తొలుత చెరువుల బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టగా... నేడు చెరువుల మధ్యలోనే నిర్మిస్తున్నారు. గుర్రం చెరువు 60 శాతం బాలాపూర్ మండలం, 40 శాతం బండ్లగూడ మండలం రెవెన్యూ పరిధిలో ఉంది. రెండు మండలాల పరిధిలో మొత్తం 17 ఎకరాలు ఆక్రమణకు గురైంది. స్థానికులే కబ్జాలకు పాల్పడుతున్నారు. గుర్రం చెరువుకు సంబంధించిన ఆక్రమణలపై 4 హత్యలు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కబ్జా రాయుళ్లకు భయపడి ఇక్కడికి రావాలంటే అధికారులు జంకుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా.... చెరువుల్లో ఇళ్లు నిర్మించుకున్నా... రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు ఒక్కరికీ నోటిసులు ఇవ్వకపోవడం గమనార్హం.
వాన కురిస్తే అవస్థలే...
ఇటీవల వర్షం పడిన సమయంలో అర్ధరాత్రి గుర్రం చెరువు తెగి కల్లోలం సృష్టించింది. ఒక్కసారిగా ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉరుకులు పరుగులు తీశారు. కొందరు ఇంటి పైకెక్కి ప్రాణాలను కాపాడుకుంటే.. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. నీటి ఉద్ధృతికి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు నేలమట్టమయ్యాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. వరద ధాటికి దిగువ బస్తీల్లో ఇళ్లు, ప్రహరీలు కూలాయి. 13 తేదీన కురిసిన భారీ వర్షంతో గుర్రం చెరువు పూర్తిగా నిండి ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నబీల్ కాలనీ, సయీద్ కాలనీ, రాయల్ కాలనీ, మెట్రో సిటీ, వీఐపీ కాలనీ, అలీ గుల్షన్, మజీద్ కాలనీ, బార్కాస్ బస్తీలు నీట మునిగాయి. మళ్లీ 17 న వాన కురవడం వల్ల చెరువు తెగి దిగువన ఉన్న హఫీజ్‌బాబానగర్ ఎ, బి, సి బ్లాక్‌లతో పాటు నసీబ్‌నగర్, నర్కీపూల్ బాగ్, సాయిబాబానగర్, శివాజీనగర్, అరుంధతి కాలనీ, లలితాబాగ్‌లు జలమయమయ్యాయి.