ఒకప్పుడు సాగు, తాగునీటి వనరుగా ఉన్న రామంతాపూర్ పెద్దచెరువు... కాలక్రమేణా మురికికూపంగా మారిపోయింది. చేపల పెంపకం ద్వారా వేల కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన ఈ జలాశయం... ఇప్పుడు చెత్త, చెదారం, పూడిక పేరుకుపోయి సహజత్వాన్ని కోల్పోయింది. ఒకప్పుడు 33 ఎకరాల్లో విస్తరించిన చెరువు.. ఇప్పుడు సగానికి పైగా ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది.
అడ్డగోలుగా ఆక్రమణలు
ఓయూ నుంచి పెద్ద చెరువులోకి నీరు వచ్చే చాలా కాలువలపై ఇళ్లు, భవనాలు వెలిశాయి. నాలాలకు అడ్డంగా మట్టి దిబ్బలు, గోడలు కట్టి ఎక్కడిక్కడ అడ్డుకట్ట వేశారు. చాలా చోట్ల నాలాల సహజ మార్గాన్ని మార్చి పైనుంచి ఇళ్లు నిర్మించుకున్నారు. కాలువ రూటు మార్చడం, విస్తీర్ణం తగ్గించటంతో మ్యాన్‌హోళ్ల వెంబడి ధారళంగా వరద నీరు బయటకు పొంగిపోతోంది. ఎక్కడిక్కడ గోడలు పడి పోయి... వరద నీరు ముంచెత్తుతోంది. ఇటీవల వర్షాలకు రవీంద్రనగర్, సత్యనగర్, సీబీఎన్ నగర్‌లోని చాలా కాలనీల్లో ఇళ్లు మునిగిపోయాయి.
ఇంకా ముంపులోనే..
వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రామంతపూర్ పెద్దచెరువు శివారులో పలు కాలనీలు ఏర్పడ్డాయి. చెరువుకు అతి సమీపంలో ఉన్న సాయిచిత్రనగర్ కాలనీ... వర్షం వెలిసి ఇన్నిరోజులైనా... ఇంకా ముంపులోనే ఉంది. చెరువుకుండే తూముల మూసివేత.. ఆక్రమణలతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఓ మోస్తరు వర్షానికి భయపడే పరిస్థితి నెలకొంది.