మా తాతయ్య చీర నేస్తుంటే చూడ ముచ్చటేసేది. ఆసుపోయడం.. మగ్గం ఆడించడం.. వింతగా ఉండేది. బాల్యంలో తాతయ్య ఇంట్లోనే ఉండేదాన్ని. ‘తాతా! నేనూ మగ్గం ఆడిస్తా!’ అని అడిగితే.. ‘ఈ కష్టం నీకొద్దు బిడ్డా!’ అనేవాడు. తాతయ్య ఎందుకలా అనేవాడో అప్పుడు అర్థమయ్యేది కాదు.
కాస్త పెద్దయ్యాక వారి సృజనాత్మకత చూసి నోట మాట వచ్చేది కాదు. రంగురంగు దారాలతో అందమైన చీరను తీర్చిదిద్దడం వెనుక నేత కార్మికుల కష్టం ఎంతో అప్పుడే తెలిసొచ్చింది. ఇంకాస్త లోకజ్ఞానం పెరిగాక.. వారి శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం రెండూ రావడం లేదని అర్థమైంది. అందుకే కాబోలు తాతయ్య.. ఆరోజు ఆ మాటన్నాడు అనుకునేదాన్ని.
ఆలోచనలన్నీ చేనేత చుట్టే..
కొన్నాళ్లకు మా కుటుంబం పుణె చేరుకుంది. అమ్మానాన్నలిద్దరూ ప్రభుత్వోద్యోగం చేసేవారు. నన్ను బాగా చదివించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి టాటా సంస్థలో ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తున్నా.. చేనేత కళ నన్ను వెంటాడుతూ ఉండేది. ఎలాగైనా ఆ కళాత్మక రంగంలోకి అడుగుపెట్టాలని కలలు కనేదాన్ని.
అమ్మానాన్న దగ్గర ఈ విషయం ప్రస్తావించినప్పుడల్లా ‘పిచ్చిపిచ్చి ఆలోచనలు మానుకో. ఇంత చదివిందీ చీరలు అమ్ముకోవడానికా!’ అనేవారు. నేను మాత్రం నా ఆశయం దిశగా అడుగులు వేయాలని నిశ్చయించుకున్నా. వాణిజ్యవేత్తగా రాణించాలంటే అందుకు తగిన విజ్ఞానం అవసరం.
ఉద్యోగం వదిలేసి లఖ్‌నవూలో ఎంబీఏ చేశాను. తర్వాత ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరా. నా దగ్గర మూడు లక్షల రూపాయలు పోగైన తర్వాత.. ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాను. 2017లో ‘కారాగిరి’ అంకుర సంస్థను మొదలుపెట్టాను.
కొత్తగా నాసిక్ పట్టు..
వ్యాపారవేత్తగా నేను బాగుపడటంతో పాటు.. భారంగా బతుకీడుస్తున్న చేనేత కార్మికుల జీవితాల్లోనూ మార్పు తీసుకురావాలని భావించాను. మహారాష్ట్రలోని చేనేత గ్రామాలన్నీ తిరిగాను.