యోగా చేస్తే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని అందరికీ తెలుసు. ఎలాంటి ఆరోగ్య సమస్య నుంచి అయినా ఉపశమనం కలిగించే శక్తి యోగాకు ఉంది. అందుకే కొవిడ్‌పై పోరులో యోగా సాధన ప్రాధాన్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా చాలామంది అడుగు బయట పెట్టడానికి సంశయిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది.
ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ ఆన్లైన్ ద్వారా యోగా ప్రతి ఒక్కరికీ చేరువవుతోంది. కొవిడ్ కారణంగా యోగా శిక్షణ శిబిరాలకు వచ్చి సాధన చేసే అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే ఆన్లైన్ ట్రెండ్‌లో యోగా భాగమైంది. ఇంటినుంచి ఫోన్లో ప్రత్యేక యాప్‌లు వినియోగిస్తూ యోగా చేస్తున్నారు. ఆన్లైన్ యోగా తరగతులు ఆస్వాదిస్తున్న వారిలో అన్ని వయసుల వారు ఉన్నారు. ఈ సరికొత్త అనుభూతి తమకు ప్రత్యేకంగా ఉందని అంటున్నారు.