పర్యాటకులకు హైదరాబాద్ పేరు వింటేనే మదిలో చార్మినార్, మక్కామసీదు కట్టడాలు గుర్తుకు వస్తాయి. ఎంతో ఘనచరిత్ర గల హైదరాబాద్‌లో పాతబస్తీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. చారిత్రక కట్టడాలన్నీ అధికశాతం పాతబస్తీ పరిధిలోకే వస్తాయి. పర్యాటకులు హైదరాబాద్‌కు చేరుకోగానే మొట్టమొదటగా పర్యటించే ప్రాంతం చార్మినార్. ఆ తర్వాతనే మిగతా ప్రాంతాలకు వెళుతుంటారు.
అభివృద్ధిలో అథమం...
ఎంతో ఘనచరిత్రగల వారసత్వ నగరంలో అభివృద్ధిలో మాత్రం అథమం. చారిత్రక నిర్మాణాలకు వెళ్లాలంటే అవసరమైన రహదారులను పట్టించుకొనే నాథుడే లేడనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రోజురోజుకు ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అవసరానికి అనుగుణంగా రహదారుల వెడల్పు, కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం.. ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇరుకైన రహదారులు ఉండటం వల్ల రవాణా సౌకర్యం అంతంత మాత్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.
రహదారుల దుస్థితి అధ్వానం...
పురానాపూల్, లక్డీకాపూల్, నయాపూల్ ప్రాంతం నుంచి పాతబస్తీకి అడుగు పెట్టడంతోటే రహదారుల దుస్థితి కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు వచ్చే చార్మినార్, మక్కామసీదుతో పాటు చౌమహల్లా ప్యాలెస్, చుడీబజార్, ఫలక్‌నుమా ప్యాలెస్, జూపార్క్ తదితర ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..