‘అమ్మా నా నైట్ డ్రెస్సులన్నీ అయిపోయాయి’ అంది జానూ ఉరఫ్ జాహ్నవి. ‘మొన్ననే కదా పది డ్రెస్సులు కొన్నావ్ అప్పుడే ఏంటీ’ అంది పల్లవి. ‘అవునమ్మా... రోజూ అవే వేసుకుంటుంటే ఎన్ని రోజులు వస్తాయి’ అంటూ గొణుక్కుంది జానూ. నిజమే మరి... పేరుకే అవి నైట్ డ్రెస్సులు కానీ ఎక్కువసేపు వేసుకునేది వాటినే మరి. దీనికి చిన్నాపెద్దా ఆడామగా తేడా లేదు. ఒంటికి హాయిగా సౌకర్యంగా ఉంటాయన్న కారణంతో ఇంట్లో ఉన్నంతసేపూ అవే వేసుకుంటున్నారు.
వాటితోనే అన్ని పనులూ చేస్తున్నారు. దాంతో ఆఫీసులకీ పార్టీలకీ వేసుకునే డ్రెస్సులతో పోలిస్తే ఇవి త్వరగా ఫేడ్ అయిపోతాయి. అయినా ఎంత ఇంట్లో ఉంటే మాత్రం... ఎప్పుడూ పాతబడినవో ఒకేలాంటివో వేసుకుని తిరుగుతుంటే ఏం బాగుంటుందీ... అన్న విషయాన్ని బాగా గుర్తించింది నేటితరం. అందుకే అవి కూడా కొత్తగా ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటోంది. దానికి తగ్గట్లే వాటిని ఎప్పటికప్పుడు సరికొత్తగా డిజైన్ చేస్తున్నారు డిజైనర్లు.
అదీగాక, ఒకప్పుడు నైట్‌వేర్ అనేది పడకగదికే పరిమితం. క్రమంగా అది పడకగది దాటి హాల్లోకీ వంటింట్లోకీ ప్రవేశించి హోమ్లీవేర్‌గా మారిపోయింది. అప్పుడప్పుడూ దానితోనే బయటకు అంటే- జిమ్‌కో వాకింగుకో యోగాకో వెళ్లడమూ మొదలైంది. దాంతో నైట్ డ్రెస్సునీ దాదాపు ఫార్మల్‌వేర్‌లానే డిజైన్ చేస్తున్నారు.
అంతేకాదు, వర్క్ ఫ్రమ్ హోమ్‌లతో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఏడాదిలో సగం రోజులు ఇంటికే పరిమితమవుతున్నారు. అందువల్లా నైట్ కమ్ హోమ్ వేర్‌కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. పైగా స్టైల్ ఏదయినాగానీ కాలానికి తగ్గట్టుగా అంటే- వేసవికి కాటన్, చేనేత ఫ్యాబ్రిక్కుతో హాయిగా గాలాడేలా, చలికాలంలో రేయాన్, ఊలు, వెల్వెట్ క్లాత్‌తో వెచ్చగా ఉండేలా, వర్షాకాలంలో త్వరగా ఆరిపోయేలా సిల్కు, నైలాన్, శాటిన్ ఫ్యాబ్రిక్కులతో డిజైన్ చేయడం వల్లా నైట్‌వేర్ వాడకం ఎక్కువవుతోంది.
హాయిహాయిగా..!
రెండుమూడు దశాబ్దాల క్రితం దక్షిణాదిన పెళ్లయిన మగవాళ్లయినా టీనేజీ కుర్రాళ్లయినా ఇంట్లో ఉన్నప్పుడు సౌకర్యంగా ఉండేందుకు లుంగీ కట్టుకునేవారు. కొందరు మాత్రం నిక్కర్లో పైజమా ప్యాంట్లో వేసుకునేవారు. ఆడవాళ్లయితే పాతచీరల్నే ఇంట్లో కట్టుకునేవారు. ఉత్తరాదిన మాత్రం ఆడామగా అంతా లాల్చీపైజమానే ధరించేవారు. నిజానికి మొఘల్స్ నుంచి వచ్చిన ఈ పైజమాని బ్రిటిషర్లు సైతం సొంతం చేసుకున్నారు.
దాంతో ఒక దశలో ప్రపంచవ్యాప్తంగా నైట్‌వేర్ అంటే పైజమాగానే స్థిరపడిపోయింది. కానీ మన పైజమాల్ని వాళ్లు తీసుకుని, వాళ్ల నైట్ గౌన్ల సోకుని ముఖ్యంగా మన ఆడవాళ్లకి అంటించి పోయారు బ్రిటిషర్లు. దాని ఫలితమే నైటీలు. వీటిల్లోని సౌకర్యం తెలిశాక చాలామంది పగలూ రాత్రీ కూడా ఇంట్లో ఉన్నంతసేపూ అవే వేసుకోవడం ప్రారంభించారు.