హైదరాబాద్ నగరంలో చెరువులు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని తమ ఉనికిని కోల్పోతున్నాయి. జంట నగరాల్లోని చెరువులు చాలా వరకు కబ్జాకు గురి కావడంతో వర్షాలు పడిన ప్రతి సారి పలు కాలనీలు నీట మునుగుతున్నాయి.
హైదరాబాద్ మీర్‌పేట్ నగర శివారులోని మీర్‌పేట్-బడంగ్‌పేట్‌ల మధ్య మీర్‌పేట్ పెద్ద చెరువు ఉంది. హరితహారంలో భాగంగా చెరువు కట్టకు భారీగా డ్రిల్లింగ్ చేశారు. మొక్కల కోసం తవ్విన ఈ గుంతల నుంచి నీరు లీక్ అవుతోంది. శిఖం భూములు చాలా వరకు కబ్జా కావడం.. ఇంటి వ్యర్థాలను కట్టకు లోపలి వైపు పారవేయడంతో చెరువు విస్త్రీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. చిన్న పాటి వర్షానికే చెరువు పొంగిపొర్లుతోంది. ఫలితంగా కట్ట కింద ఉన్న కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి.
కాలనీల మీదుగానే..
మీర్‌పేట్ పెద్ద చెరువు నిండితే.. ఆ నీరు మంత్రాల చెరువులోకి వెళ్తుంది. అయితే నీరు వెళ్లేందుకు ఎలాంటి కాలువలు లేకపోవడం వల్ల టీఎస్ఆర్ నగర్, ఎమ్మెల్లార్ కాలనీ, అయోధ్య నగర్, ఎస్.ఎల్.ఎస్.ఎన్.ఎస్. కాలనీ, తిరుమల ఎంక్లేవ్, జనప్రియ మహానగర్ కాలనీల మీదుగా మంత్రాల చెరువుకు చేరుకుంటోంది. మంత్రాల చెరువు నుంచి నీరు తాళ్ల చెరువుకు వెళ్లాల్సి ఉంది. అయితే తాళ్ల చెరువు మొత్తం కబ్జాకు గురికావడంతో అటు వెళ్లాల్సిన నీరు సైతం మిథిలా నగర్ కాలనీ, సత్యసాయి నగర్, సాయి బాలాజీ నగర్ల మీదుగా సందె చెరువులోకి వెళుతోంది.
బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు..
ఇటీవల కురిసిన వర్షంతో పెద్ద చెరువులోకి నీరు భారీగా చేరడం వల్ల ఈ కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మొత్తం 5 వేల కుటుంబాల వరదల్లో చిక్కుకోగా.. అందులో సుమారు 3 వేల ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. మిగిలిన 2 వేల ఇళ్లలోకి పాక్షికంగా నీరు చేరడం వల్ల అదే ఇళ్లలో ఉంటూ రోజులు వెళ్లదీస్తున్నారు.