దృఢమైన ఫర్నిచర్‌కి... అల్పంగా ఉండే చిత్తుకాగితాలకు సంబంధం ఏంటి? వాడేసిన టీపొడికీ... ఖరీదైన ఇంటీరియర్ డెకరేషన్‌కి ఉన్న లింక్ ఏంటి? మామూలుగా అయితే ఉండకపోవచ్ఛు కానీ... స్పృహ చోకానీ, షబ్నమ్‌లు వాటిమధ్య ఓ దృఢమైన బంధాన్ని తీసుకొచ్చారు. స్పృహ చిత్తుకాగితాలతో అందమైన ఫర్నిచర్‌లు తయారుచేస్తుంటే... షబ్నమ్ వాడేసిన టీపొడితో ఇంటికి కొత్త అందాలు తెస్తున్నారు. మేఘ పాతటైర్లతో చెప్పులని తయారుచేస్తోంది.. వ్యర్థాలకు సరికొత్త పద్ధతిలో అర్థం చెబుతున్నారు వీరంతా...!
వ్యర్థాలకు... కొత్తందాలు తెస్తున్నారు!
By
Published : Aug 25, 2020, 11:59 AM IST
|
Updated : Aug 25, 2020, 12:50 PM IST
కాగితాలతో ఫర్నిచర్
ప్లాస్టిక్, ఇనుము, కలపతో చేసిన ఫర్నిచర్ మనకి కొత్తేం కాదు. కానీ స్పృహ తయారుచేసిన ఫర్నిచర్ వీటికి భిన్నంగా ఉంటుంది. చిత్తుకాగితాలతో ఆమె తయారుచేసే పేపర్‌మెషే ఫర్నిచర్ సాధారణ ఫర్నిచర్‌కి దీటుగా బరువులని తట్టుకుంటుంది. దిల్లీలో ఇండియా డిజైన్ వీక్‌లో డిజైనర్ల నుంచి ప్రశంసలు పొందిన ఈ ఫర్నిచర్ వెనుక ఆసక్తికరమైన విషయాలే ఉన్నాయి. అసోంకు చెందిన స్పృహ చోకానీ బెంగళూరులో ప్రొడక్ట్ డిజైనింగ్‌లో కోర్సు చేసింది. ఆ సమయంలో ఉత్పత్తుల తయారీలో అనేక ప్రయోగాలు చేసింది. అప్పుడే కాగితం వృథా నుంచి తయారయ్యే పేపర్‌మెషే ఉత్పత్తులు ఆమెని ఆకర్షించాయి. అందులో నైపుణ్యం సాధించిన తర్వాత సొంతంగా పల్ప్‌ఫ్యాక్టరీ పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది. అయిదుగురు సిబ్బందితో జైపూర్‌లోని తన ఇంట్లోనే సంస్థను మొదలుపెట్టింది స్పృహ. ఇందులోభాగంగా వాడేసిన కాగితపు గుజ్జుని శుద్ధి చేసి.. మొక్కజొన్నల గింజలు, బంగాళాదుంపలు, బియ్యంతో చేసే పిండిని ఈ మిశ్రమంలో కలుపుతారు. కర్రపెండలం గుజ్జుని జిగురుగా వాడతారు. ఈ ముడిపదార్థంతో వివిధరకాల పర్సులు, చేతి బ్యాగులతోపాటూ చక్కని ఫర్నిచర్‌నీ రూపొందిస్తుంది స్పృహ చోకానీ. ‘ఈ కాగితం గుజ్జుతో... కుర్చీలు, స్టూల్స్ వంటివి రూపొందిస్తున్నాం. ఒక్కో వస్తువు తయారీకి ఎనిమిది కేజీల కాగితం వృథాని వినియోగిస్తాం’అనే స్పృహ ప్యాకింగ్‌కు సైతం వ్యవసాయ వ్యర్థాలనే వాడుతున్నారు.
రద్దుతో పాదరక్షలు
రాజస్థాన్‌కు చెందిన మేఘారావత్ ఐదేళ్ల క్రితం ముంబయిలో ‘కురియో డిజైన్స్’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. దుస్తుల రద్దు, పాతటైర్లతో అందమైన లైఫ్‌స్టైల్ వస్తువులు తయారుచేస్తూ ... వృథాని అరికడుతోంది.
తండ్రి వృత్తిరీత్యా మేఘ వాళ్ల కుటుంబం రాజస్థాన్‌కు వచ్చేసింది. అక్కడ నీటికొరత, కరెంటు కోతలను చూశాక సహజ వనరుల విలువ ఏంటో తెలుసుకుంది. కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన మేఘాని కొన్ని విషయాలు ఆలోచనలో పడేశాయి. అవసరం లేకపోయినా వస్తువులను కొనడం, ఆ తర్వాత కొన్నాళ్లకే నిర్లక్ష్యంగా వాటిని పక్కన పడేయడం ఆమెకు ఎంత మాత్రం నచ్చలేదు. అంత వృథాని సృష్టించడం పర్యావరణానికి ఎంతమాత్రం మంచిది కాదనుకున్న మేఘ వృథాకి సరికొత్త అర్థం చెప్పాలనుకుంది. అందుకు తల్లినే స్ఫూర్తిగా తీసుకుంది. ఎందుకంటే మేఘవాళ్ల అమ్మ.. తన పాత చీరలనే మేఘకు సల్వార్ కమీజ్‌లుగా, గౌనులుగా కుట్టేది. మేఘ ప్రారంభించిన కురియో సంస్థ బ్రూచెస్, ఫోల్డర్స్, ఫ్రిజ్ మాగ్నెట్స్, పర్సులు, పౌచెస్ వంటివెన్నో తయారుచేస్తుంది. ఇవన్నీ వృథా నుంచి తయారుచేసేవే. ఇక పాదరక్షలనయితే... స్ట్రైప్స్‌కోసం వృథాగా ఉన్న వస్త్రపు రద్దుని వాడుతుంది. సోల్‌కోసం పాత టైర్లను ఉపయోగిస్తోంది. అలాగని నాణ్యత, వాటి తయారీ విషయంలో ఏమాత్రం రాజీపడదు. అవి వృథాతో తయారైనవి అని చెబితేకానీ పసికట్టలేరు.
వృథా తేయాకు పొడితో...
దిల్లీకి చెందిన షబ్నమ్‌సింగ్, తన కూతురు నన్కీతో కలిసి ప్రాజెక్ట్ డాట్‌కో పేరుతో ఇంటీరియర్ డిజైనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ సంస్థను నిర్వహిస్తోంది. వీరు చేసే ఇంటీరియర్ డిజైనింగ్‌కి చాలా డిమాండ్ ఉంది. శ్వేతాబచ్చన్ వంటి వాళ్లు షబ్నమ్ ఇంటీరియర్ స్టైల్‌కు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగంగా ఇంటా, బయటా వీళ్లు ఏర్పాటు చేసే మొక్కలంటే వినియోగదారుల్లో చెప్పలేనంత ఆసక్తి ఉంది. ఇంటిని మరింత ఆకర్షణీయంగా మార్చే శక్తి మొక్కలకే ఉందంటారు ఈ తల్లీకూతుళ్లు. అయితే ఈ మొక్కలని నర్సరీల నుంచి తెప్పించి వినియోగదారులకు అందించడం వీళ్ల పని కాదు. నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలకు సేంద్రియ పద్ధతుల్లో స్వయంగా తయారుచేసిన ఎరువుని అందిస్తారు. అలా ఎరువుని తయారుచేసేటప్పుడు వీళ్లిద్దరూ చాలా ప్రయోగాలే చేశారు. అందులో విజయవంతమైన ప్రయోగం... టీపొడి వ్యర్థాలని శక్తిమంతమైన ఎరువుగా మార్చడం. ‘వాడిపారేసిన టీపొడిని శుద్ధి చేస్తే మొక్కలకు అదెంతో శక్తిమంతమైన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న టీవ్యర్థాలని ఉపయోగించుకుని మా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాం. ఇందుకోసం మేమే సొంతంగా ఇంట్లోనే ప్రయత్నాలు మొదలుపెట్టాం. తర్వాత పెద్దఎత్తున వాడేసిన టీపొడిని, టీబ్యాగులని సేకరించి శుద్ధిచేయడం మొదలుపెట్టాం. అలా శుద్ధి చేస్తేనే ఇందులో ఉండే పాలు, చక్కెర అవశేషాలు తొలగిపోయాయి. ఆరిన తరువాత దీన్ని పొడిగా ఉండే డబ్బా లేదా సీసాల్లో భద్రపరుస్తాం. మా ప్రయోగం విజయవంతమైన తరువాత, ఆ ఎరువును పూలు, పండ్ల మొక్కలన్నింటికీ వినియోగించడం మొదలుపెట్టాం.’ అని చెబుతున్నారు ఈ తల్లీకూతుళ్లు.