తెలంగాణ

telangana

ETV Bharat / state

మహా శివరాత్రికి ముస్తాబైన ఆలయాలు - special story on Mahashivarathri

మహా శివరాత్రిని పురస్కరించుకుని.. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు ముస్తాబవుతున్నాయి. వేములవాడ, ఓరుగల్లు సహా ప్రముఖ శైవ క్షేత్రాలకు.. భక్తులు పెద్దెత్తున తరలిరానున్నారు. జాతరకు వచ్చే ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

special story on Mahashivarathri festival celabrations in telangana
మహా శివరాత్రిని పురస్కరించుకుని ముస్తాబైన ఆలయాలు

By

Published : Mar 10, 2021, 8:30 AM IST

Updated : Mar 10, 2021, 8:57 AM IST

మహా శివరాత్రిని పురస్కరించుకుని ముస్తాబైన ఆలయాలు

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పుణ్యక్షేత్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి జాతర నిర్వహణకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులందరూ సంసిద్దంగా ఉండాలని... దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వేములవాడ దేవస్థానంలోని అతిథి గృహంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి... మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.సంబంధిత శాఖల అధికారులు చేపట్టాల్సిన చర్యలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రతీ సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి జాతర అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.

హెలిటాక్సీ సేవలు

ప్రభుత్వ శాఖల అధికారులందరూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతర విజయవంతానికి కృషి చేయాలని ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని కోరారు. కొవిడ్ దృష్ట్యా ఈ సంవత్సరం ఆలయంలోని ధర్మగుండంలో స్నానాలకు అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు. జాతర నిర్వహించే 3 రోజులపాటు ఒక్కో రోజుకు దాదాపు లక్ష మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ దిశగా అధికారులు అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం హెలిటాక్సీ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి వివరించారు.

ఆలయాల వద్ద విద్యుద్దీప కాంతులు

మహాశివరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లులోని శివాలయాలు సిద్ధమవుతున్నాయి. ఆలయాల వద్ద విద్యుద్దీప కాంతులు కన్నార్పకుండా చేస్తున్నాయి. త్రివేణి సంగమం చెంత.. కొలువైన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం, వరంగల్ వేయి స్తంభాల దేవాలయం, రామప్ప, కురవి వీరభద్రస్వామి ఆలయాల్లో వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు...అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే స్వామికి అభిషేకాలు.. ప్రత్యేక పూజల నడుమ...భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. హన్మకొండ వేయి స్తంభాల ఆలయంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు.. ఏర్పాట్లు పూర్తయ్యాయి. తోపులాటలు జరగకుండా భక్తుల కోసం.. అన్ని ఆలయాల్లో క్యూ లైన్లు సిద్ధం చేశారు.

సర్వాంగ సుందరంగా

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో వెలిసిన శ్రీ వన దుర్గా మాత దివ్య క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా 8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. దేశంలోనే రెండో వనదుర్గామాతగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మహాశివరాత్రి జాతరకు... జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంగారెడ్డి జిల్లా కేతకీ సంగమేశ్వరాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కేతకి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 4 లక్షల మంది భక్తులు తరలిరానున్నడంతో కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తూ భౌతిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Last Updated : Mar 10, 2021, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details