ఆధునిక మానవుడి విపరీత చేష్టలకు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. జీవవైవిధ్యానికి విఘాతం ఏర్పడటంతో.. అనేక జీవరాశుల మనుగడ ప్రమాదపు అంచుల్లో నిలుస్తోంది. విలువైన అటవీ సంపద నాశనం అవుతుండటంతో.. క్రూర జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. క్రమంగా వాటి సంఖ్య తగ్గిపోయి.. అంతరించిపోతున్న జంతువుల జాబితాకు చేరుతున్నాయి. ముఖ్యంగా.. అడవికి రారాజుగా పేరొందిన పులుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. గతంలో గుంపులు గుంపులుగా కనిపిస్తూ.. ఇతర జంతువులను వేటాడి చంపుతూ అడవిని శాసించిన ఈ క్రూరమృగాలు.. ఇప్పుడు మనుగడ కోసం మూగపోరాటం చేస్తున్నాయి.
భారత్‌లో ఆశాజనకంగా పులుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో 3, 900 పులులు ఉండగా.. వాటిలో 75% వ్యాఘ్రాలకు భారత్ ఆలవాలం. 20వ శతాబ్దం ప్రారంభం నాటికే ప్రపంచ పులుల జనాభాలో 90% అంతరించి పోయాయి. వందేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష పులులు బతికినట్లు రికార్డులు ఉండగా ఈ శతాబ్ద కాలంలోనే వీటి మనుగడ ప్రమాదపు అంచులకు చేరుకుంది. 2018లో నిర్వహించిన పులుల గణన ప్రకారం.. భారత్‌లో 2,967 పులులు ఉన్నాయి. ఒకే ఏడాదిలో ఆయా పులుల అభయారణయ్యాల్లోని 2,461 పులుల కదలికల్ని కెమెరాల ద్వారా చిత్రీకరించిన కేంద్ర పర్యావరణ , అటవీ మంత్రిత్వ శాఖ.. గిన్నిస్ రికార్డు సైతం కైవసం చేసుకుంది. ఇందుకోసం లక్షా 21వేల 337 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం జల్లెడ పట్టారు. ప్రస్తుతం భారత్‌తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, థాయ్ లాండ్, చైనా, రష్యా తదితర దేశాల్లో మాత్రమే పులుల కదలికలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సంఖ్య
2006లో ఏర్పాటైన జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ-ఎన్‌టీసీఏ ఇప్పటికి 4 సార్లు దేశవ్యాప్తంగా వన్యప్రాణుల గణన చేపట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఈ సంస్థ నాటి నుంచి దేశంలో పులుల సంరక్షణ కోసం కృషి చేస్తోంది. 2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య 68 కాగా, 2018 నాటికి ఏపీ, తెలంగాణల్లో కలిపి వీటి సంఖ్య 74కు చేరింది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నాయి. డబ్బుల కోసమో .. దర్పం కోసమో.. వేటాడే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఈ సరదా.. పులుల ప్రాణాలు తీస్తోంది. కొన్ని గిరిజన గ్రామాల్లో.. నివాసాలపై పులులు చేసే దాడులను నిలువరించటానికి వాటిని వేటాడుతున్నారు. గతేడాది వేర్వేరు కారణాల వల్ల దేశంలో 100 పులులు మృత్యువాత పడ్డాయి. సరిహద్దుల కోసం పులుల మధ్య ఘర్షణలు, ఇతరులు వాటిని వేటాడటం, ప్రమాదాలు, ప్రకృతివైపరీత్యాల కారణంగా పులులు మృత్యువాత పడినట్లు ఎన్‌టీసీఏ వెల్లడించిది.
జీవవైవిధ్యంలో ప్రత్యేకంగా నిలిచే.. అటవీ ప్రాంతంలో అతిపెద్ద క్రూరమృగాల్లో ఒకటైన పులుల సంరక్షణ కోసం కొన్నేళ్లుగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ఏటా జులై29న ప్రపంచ పులుల దినోత్సవం నిర్వహిస్తారు. 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన ఓ సదస్సులో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. పులులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు సంరక్షించటం .. వేటాడకుండా ప్రజల్లో అవగాహన కల్పిచటం లాంటి చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య ఎంతో కొంత పెరిగినప్పటికీ.. రక్షణ చర్యలు అంతంతమాత్రంగా ఉండటం వల్ల ఆందోళన వీడటం లేదు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ముందంజ
పులుల సంరక్షణ కోసం ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ.. గ్లోబల్ టైగర్ ఫోరం ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్యను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. 2022 నాటికి పులుల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించుకున్న ఈ సంస్థ.. మిగిలిన దేశాలను లక్ష్యం దిశగా సమాయత్తం చేస్తోంది. ప్రత్యేకించి భారత్ మిగిలిన దేశాలతో పోలిస్తే పులుల సంరక్షణలో ముందుంది. 1973 నాటికి దేశంలో పులుల అభయారణ్యాలు 9 మాత్రమే ఉండగా.. వీటి సంఖ్య ప్రస్తుతం 51కి చేరుకుంది. తమిళనాడులోని మేఘమలై, శ్రీవల్లి పుత్తూరు అటవీప్రాంతాన్ని..పులుల అభయారణ్యంగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. తెలంగాణలో పులుల కోసం అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలు ఉండగా.. ఏపీలో శ్రీశైలం-నాగార్జునసాగర్ అభయారణ్యం దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లలో ఒకటిగా పేరుగాంచింది. ఈ అభయారణ్యంలో కనీసం 70 పులులు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.