పారా మోటార్ గ్లైడింగ్‌లో సత్తా చాటుతున్న సుకుమార్ Paramotor pilot: చిన్నప్పటి నుంచి చాలామంది చాలా కలలు కంటారు. వారిని ఆకర్షించిన ఏదైనా రంగంలో రాణించాలనుకుంటారు. కానీ.. పెద్దయ్యే కొద్దీ అందులో ఆసక్తి కోల్పోతుంటారు. హైదరాబాద్‌కు చెందిన సుకుమార్ దాస్ మాత్రం అలా కాదు... చిన్నప్పటి నుంటి గాలిలో ఎగరాలని కలలు కన్న ఆ యువకుడు.. ఎన్నో వ్యయ, ప్రయాసలకు ఓర్చి.. పారా మోటార్ ఫైలట్‌గా గాలిలో చక్కర్లు కొడుతున్నాడు.
పారాగ్లైడింగ్‌లో శిక్షణ
paraglider sukumar das: ట్రెక్కింగ్ చేయాలని, దూర ప్రాంతాల్ని చుట్టి రావాలనే కోరికతో మధ్యలోనే గ్రాడ్యుయేషన్ ముగించాడు.. ఈ యువకుడు. ఊహల్ని నిజం చేసుకునేందుకు తన ఎదురుగా ఉన్న మార్గాల్ని అన్వేషించాడు. ఏది ఏమైనా.. తనకిష్టమైన రంగం వైపే వెళ్లాలని నిర్ణయించుకుని.. హిమాచల్ ప్రదేశ్‌లోని బీర్‌బిల్లింగ్‌లో పారా గ్లైడింగ్‌లో 3 నెలల బేసిక్ అడ్వాన్స్ అండ్ ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేశాడు. ముంబయి దగ్గర కామ్ షెట్‌లో నిర్వహణ పారాగ్లైడింగ్ స్కూల్‌లో పీ1పీ2 బేసిక్ పూర్తి చేశాడు.
ఆ ఆలోచనతో...
International paraglider sukumar das: వాస్తవానికి.. పారాగ్లైడ్ శిక్షణ అత్యంత ఖరీదైంది. అయినా వెనుకాడని... సుకుమార్.. ఎన్నో సవాళ్ల మధ్య పారాగ్లైడింగ్ శిక్షణ పూర్తి చేశాడు. ఈ క్రీడకు కొండ ప్రాంతాలు అనుకూలం... కానీ దగ్గర్లో అందుకు సంబంధించి పూర్తిస్థాయి సౌకర్యాలు లేక పోవడంతో.. ప్రత్యమ్నాయ మార్గాలు అలోచించాడు. అప్పుడే పారాగ్లైడింగ్‌కి అదనంగా మోటర్ బిగించాలనే ఆలోచన వచ్చింది. అంతే... తక్షణమే థాయిలాండ్‌కి వెళ్లి పారా మోటార్ గ్లైడింగ్‌లో శిక్షణ పొందాడు.
కుటుంబ ప్రోత్సాహాంతో
Special story on paraglider sukumar das: పాశ్చాత్య దేశాల్లో ఈ క్రీడకు మంచి ఆదరణ ఉండగా, భారత్‌లో పెద్దగా పాచూర్యం లేదు. చాలామందికి అవగాహాన సైతం లేదు. దక్షిణాది నుంచి ఏకైక పారామోటర్ క్రీడాకారుడు సుకుమార్ దాస్ ఒక్కడే అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రీడకు ప్రాచుర్యం లేదని సాయం చేసేందుకు... అధికారులు వెనకడుగు వేసినా.... కుటుంబ ప్రోత్సాహాంతో సొంతగడ్డపై ఎగరాలనే పట్టుదలతో కృషి చేశాడు. జర్మనీ, అమెరికా నుంచి 2 ఇంజన్లు దిగుమతి చేసుకుని.... దానికి సంబంధించిన కేజ్, సీటింగ్, రెక్కులు తయారు చేసి పారామోటర్‌ను సిద్ధం చేశాడు సుకుమార్.
ఛాంపియన్ షిప్‌లో కాంస్యం
హైదరాబాద్‌లోని సూరారం, వికారాబాద్ కొండల్లో సాధన చేసిన సుకుమార్... ఆ సమయంలో అనేక అవాంతరాలు ఎదుర్కొన్నాడు. తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా ఎన్నో కష్టాలు పడ్డ సుకుమార్... దిల్లీలోని ఎయిరో క్లబ్ ఆఫ్ ఇండియాలో లైసెన్స్ పొంది... వివిధ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2017లో తొలిసారి థాయిలాండ్‌లో జరిగిన కింగ్స్ కప్ పోటీల్లో పాల్గొన్న సుకుమార్. 2018 బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ పారామోటర్ ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ తరపున ప్రాతినిథ్యం వహించాడు. 2019లో ప్రపంచ పారామోటర్ ఛాంపియన్ షిప్‌లో తన బృందానికి కాంస్యం దక్కింది. రానున్న ఏప్రిల్‌లో బ్రెజిల్‌లో నిర్వహించనున్న 11వ పారామోటర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత జట్టు తరఫున పాల్గొననున్నాడు.
ఎందరికో ఆదర్శం
పర్యాటక రంగంలో పారామోటార్‌ల వినియోగం కీలకంగా ఉండగా.. గ్రామీణ యువతకు అతి తక్కువ ఫీజుకే శిక్షణనిచ్చి పర్యాటక ప్రాంతాల వద్ద పారామోటర్ పైలట్‌గా ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు.చిన్నప్పుడు అనుకున్న, కోరుకున్న లక్ష్యం మధ్యలోనే వదలకుండా... చివరి వరకు కొనసాగించి విజయం సాధించిన సుకుమార్ ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు.
ఇదీ చూడండి: driverless tractor : ఔరా..! ఈ ట్రాక్టర్‌కు డ్రైవర్ అవసరం లేకుండానే అన్ని పనులు చేస్తోంది