కంటికి కనిపించని మహమ్మారి సృష్టించిన భయంతో ప్రపంచమంతా ఇంటికి బందీ అయింది. బాధితులు త్వరగా కోలుకునేందుకు మనోధైర్యమే ఔషధమవుతోన్న ఈ పరిస్థితుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాల్సిన తరుణమిది. వైరస్‌కు ఎదురొడ్డి ముందువరసలో పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు బాసటగా నిలవాలి.. కొవిడ్ బాధితులకు తమవంతు సహాయం అందించి మనోధైర్యం కల్పిస్తే వారు విజేతలై నిలవగలుగుతారు.
గెలుద్దాం.. గెలిపిద్దాం..!
నగరంలో వైరస్ బారిన పడినవారిలో కొందరు ఆందోళనతో ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడ్డం అందరినీ కలచివేసింది. వైరస్‌ను జయించేందుకు మనమిచ్చే మనోధైర్యమే మందని గుర్తించాలి..వారు కోలుకునేందుకు సహకరించాలి. నగర యువత ఇప్పటికే బాధితులకు కావాల్సిన సామగ్రి సరఫరా చేయడం, ప్లాస్మా దానం వంటి సేవలతో ముందుంది. దీనిని మరింతమంది అందిపుచ్చుకోవాల్సి ఉంది.