తెలంగాణ

telangana

ETV Bharat / state

జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి

భాగ్యనగరంలో మహిళాశక్తి జలశక్తిగా మారబోతోంది. ఇప్పటివరకు రూపాయి రూపాయి పోగేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కించిన అతివలు ఇకనుంచి నగరంలో ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి నీటి సంరక్షణపై అవగాహన కలిపించనున్నారు. నేటి తరానికే కాదు రాబోయే తరానికీ నీటిని అందించాలని జలమండలి సంకల్పంచి రూపొందించిన జల నాయకత్వం- జల సంరక్షణ కార్యక్రమంలో భాగం కానున్నారు.

water

By

Published : Jul 15, 2019, 8:59 AM IST

జల సంరక్షణకు కదం తొక్కిన మహిళా శక్తి

హైదరాబాద్​ గోల్నాకలోని మహిళలు నీటివృథాపై పోరాటానికి పూనుకున్నారు. నీరు పొదుపుగా వాడాలని అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. దీనికి వారి ఇంటి నుంచే శ్రీకారం చుట్టిన మహిళలు కాలనీలు, బస్తీల్లో చుక్క నీరు వృథా కాకుండా చూసుకునే బాధ్యత భుజానికెత్తుకున్నారు. బియ్యం కడిగిన నీళ్లను పిల్లలు ముఖం కడుక్కోవడానికి ఇవ్వడం, కూరగాయలు శుభ్రం చేసిన నీళ్లను మొక్కలకు పోయడం, బట్టలు ఉతికిన నీటిని మరుగుదొడ్లకు వాడటం ఇలా... వృథా అయ్యే ప్రతి సందర్భంలోనూ పొదుపుగా వాడుతూ నీటి కొరతను అధిగమిస్తున్నారు.

జల నాయకత్వం-జల సంరక్షణ

నీటి సంరక్షణలో భాగంగా నగరంలోని 150 డివిజన్లలో జలమండలి "జల నాయకత్వం-జల సంరక్షణ " పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నీటి వృథాను అరికట్టాలంటే మహిళల వల్లే సాధ్యమవుతుందని గ్రహించిన జలమండలి కమిషనర్ దాన కిషోర్... నగరంలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న నాలుగురన్నర లక్షల మంది మహిళలతో కలిసి జల ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమంలో డివిజన్ల వారీగా మహిళలకు అవగాహన కల్పిస్తూ గృహ సముదాయాల్లో, కాలనీల్లో జరుగుతున్న నీటివృథాని అరికట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జలమండలిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. వారందరిని ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్​గా నియమించారు.

బొట్టు బొట్టు ఒడిసిపడతాం

ఈ జల ఉద్యమంలో... నీటి వృథా కారణాలను గుర్తించి అవగాహన కల్పించడం నాలుగున్నర లక్షల మంది మహిళల కర్తవ్యం. నేరుగా జలమండలి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సత్వరమే సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా వీరిదే. వాణిజ్య ప్రదేశాల్లో నీరు వృథా చేస్తే ఫిర్యాదు చేసి జరిమానాలు విధించడం, అపార్ట్ మెంట్స్, గృహ సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో నీటి మీటర్లు బిగించుకునేలా చర్యలు తీసుకోవడం, ప్రతి ఇంట్లో ఇంటి కప్పుపై పడే వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేలా చూడటం, ఇందుకోసం సరైన పద్ధతిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించడం, ఇంతకు ముందు నిర్మించిన ఇంకుడు గుంతలను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుచుకునేలా అవగాహన కల్పించడం ఈ మహిళలు చేయాల్సిన పనులు.

పొదుపు సంఘాల మహిళలుగా తమ కాలనీల్లో ఎంతో గుర్తింపు పొందామంటోన్న ఈ మహిళలంతా... స్వచ్ఛ సర్వేక్షణ్​లో విజయవంతమయ్యామని, తప్పకుండా ఈ జల ఉద్యమాన్ని విజయవంతం చేసి నీటి వృథాను నియంత్రిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఐదెకరాల్లో సచివాలయం భవనాలు... ఎక్కువ భాగం మొక్కలు

ABOUT THE AUTHOR

...view details