కూకట్పల్లి ఎల్లమ్మబండలో నీళ్లులేక ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. ఈ ట్యాంకర్లు కూడా వారానికోసారి వస్తాయి. అలా ట్యాంకర్ వచ్చినప్పుడల్లా ఓ పెద్దావిడ తన మనవరాలిని బడి మాన్పించి నీళ్లు పట్టుకుంటోంది. ఆ చిన్నారి వారానికి రెండురోజులు బడికి దూరమవుతోంది. ట్యాంకర్ నుంచి వృథా అయ్యే ఒక్కో నీటి బొట్టును ఒడిసిపట్టి ఆ బామ్మ నీటి కష్టాలకు ఆ పసిప్రాణం తోడుగా నిలుస్తోంది.
ఎత్తుకెళ్లకుండా కాపలా
ఇదే కాలనీలో నివసిస్తోన్న జ్యోతి అనే మహిళ నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామని వాపోతోంది. పొరుగింటి నుంచి నీరు తెచ్చుకుని డ్రమ్ముల్లో పోసి అక్కడినుంచి మోటారుతో ట్యాంకులోకి ఎక్కిస్తూ నీటిని కాపాడుతోంది. నాలుగు రోజులు కూలీ పనులు చేస్తే మూడ్రోజులు నీళ్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇలా నిత్యం ఎన్నో కుటుంబాలు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నాయి. అరకొరగా వచ్చే ట్యాంకర్ నీటిని సింటెక్స్ ట్యాంకుల్లో నిల్వచేసుకుని తాళాలు వేసుకుంటున్నారు. రాత్రుళ్లు ఆ నీటిని ఎవరూ ఎత్తుకుపోకుండా కాపలా కాస్తున్న దయనీయ స్థితిలో ఉన్నారు బస్తీవాసులు.
నీళ్ల కోసం లొల్లి
కంటోన్మెంట్ ఏరియాలోనూ నీటి కొరత తీవ్రంగా ఉంది. వారానికోసారి వచ్చే నీటిని వంట పాత్రల్లో, శీతలపానీయాల సీసాల్లో నిల్వ చేసుకుంటున్నారు. నాలుగు రోజులకోసారి బట్టలు ఉతకడం, రెండు రోజులకోసారి స్నానాలు చేస్తూ తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలో ఉండటం వల్ల నల్లా బిల్లులు అధికంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా జరిగే వేళల్లో నిత్యం మాటామాట పెరిగి వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరుగు పొరుగు మధ్య అనుబంధాలు ముక్కలవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రిళ్లు నీళ్లు రావడం వల్ల కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.