సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో గతంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించేవారు. కరోనా కేసులు పెరగడంతో పడకలకు డిమాండ్ ఏర్పడింది. తొలుత 50 పడకలు ఈ తరహా చికిత్సలకు కేటాయించారు. అయితే తాకిడి పెరగడంతో దాదాపు 200 పడకలను కరోనా సోకినవారికి కేటాయించాలని తాజాగా నిర్ణయించారు. దీంతో ఇతర సమస్యలతో వచ్చే రోగులను వేరే ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు.
బంజారాహిల్స్‌లోని ఓ వ్యక్తికి గుండెలో సమస్య రావడంతో అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని కారులో ఎక్కించి దాదాపు అయిదు ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోయింది. అన్నిచోట్లా చేర్చుకోవడానికి నిరాకరించారు. కొవిడ్ రోగులు ఎక్కువగా ఉన్నారని, తర్వాత ఇబ్బంది అవుతుందని తిరస్కరించారు. చివరకు సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో రూ.3 లక్షలు చెల్లించి చేర్పించారు.
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్సలపై దృష్టి పెట్టాయి. రోగుల సంఖ్య పెరగడం ఒక కారణమైతే...ఆసుపత్రులకు కాసులు కురిపించడం మరో ప్రధాన అంశం. కరోనా నిర్ధారణ అయిన వెంటనే చేర్చుకోవాలంటే రూ.లక్ష అడ్వాన్సు చెల్లించాల్సిందే.
తర్వాత ఆసుపత్రిని బట్టి రోజుకు రూ.30-40 వేల వరకు బిల్లులు వేస్తున్నారు. వెంటిలేటర్ అవసరమైతే ఖర్చు తడిసి మోపెడు ఖాయం. 10 రోజులపాటు ఆసుపత్రిలో ఉంటే తక్కువలో తక్కువ రూ.ఆరేడు లక్షలు చెల్లించాల్సిందే.
వైద్య బీమా ఉన్నా చాలా ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. అంగీకరించినా...పీపీఈ కిట్లు ఇతర ఛార్జీల పేరుతో కొన్ని ఆసుపత్రులు బీమా మొత్తం కంటే ఎక్కువ బిల్లులతో బాదేస్తున్నాయి.
ప్రభుత్వ ప్రతిపాదిత ఛార్జీలు అమలు కావడం లేదన్నది బహిరంగ రహస్యం. ఆసుపత్రుల నిర్వహణ, వైద్య సిబ్బంది జీత భత్యాలు, పన్నులు ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తక్కువకు సేవలు అందించడం కష్టమవుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.
మొత్తానికి సామాన్యుడి జీవితం కరోనాతో అల్లకల్లోలం అవుతోంది. అప్పటివరకు కూడబెట్టిన సొమ్ములన్నీ ఊడ్చిపెట్టి చెల్లించి బతుకు జీవుడా అంటూ బయట పడుతున్నారు. ఆసుపత్రులన్నీ కరోనా చికిత్సలకే ప్రాధాన్యమివ్వడంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు దిక్కులు చూడాల్సి వస్తోంది.