దాదాపు ప్రతి రైల్లో రిజర్వేషన్లు పూర్తై వెయింటింగ్ లిస్ట్ వస్తోంది. కొన్ని రైళ్లలో ఆ పరిమితి కూడా దాటేసి ‘రిగ్రెట్’ వస్తోంది. కొవిడ్ వ్యాప్తి కారణంగా మొన్నటి వరకు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు జనం. కొద్దిరోజులుగా రైలు ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు ప్రతి రోజు మూడు రైళ్లుంటే.. ఎందులోనూ రిజర్వేషన్ ఖాళీ లేదు. ప్రతి రోజు వెయిటింగ్ లిస్టే.
దిల్లీకి హైదరాబాద్ వైపు నుంచి ప్రతి రోజు రెండు, వారానికి రెండు రోజులు నడిచే దురంతో రైళ్లున్నా ఏ ఒక్క బండిలోనూ ఖాళీల్లేవు. కొవిడ్ నేపథ్యంలో కొన్ని రూట్లలోనే రైళ్లు నడుస్తుండటంతో మిగతా మార్గాలకు రాకపోకలు సాగించాల్సిన వారు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. సికింద్రాబాద్ నుంచి కాకినాడ, చెన్నై, త్రివేండ్రం, గువాహటి వంటి దూరప్రాంతాలతో పాటు.. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్యాసింజర్, మెమూ, డెమూ రైళ్లలో ప్రయాణాలు చేసేవారు ప్రత్యామ్నాయ రవాణా చూసుకోవాల్సి వస్తోంది.