దూరం ఎంతున్నా.. దూకేస్తానంటున్న 'గురుకులం కుర్రాడు' Special story on gurukula student pranay ట్రిపుల్ జంప్ అనేది మాములు క్రీడ కాదు. ఎంతో సాహసోపేతమైంది. ఈ క్రీడలో రాణించేందుకు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం అవసరం. అలాంటి క్రీడలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ గురుకులం విద్యార్థి. రాష్ట్ర, జాతీయ స్థాయి పతకాల పంట పండిస్తూ మేటిగా నిలుస్తున్నాడు ఈ యువ కెరటం.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఈ మట్టిలో మాణిక్యం. పేరు ప్రణయ్. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో ప్రణయ్‌ని ప్రయోజకున్ని చేయాలని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. కానీ తరగతి పెరుగుతున్న కొద్ది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోన్నాడు. దాంతో గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించాడు ఈ కుర్రాడు.
'' నేను 7 వ తరగతిలో గురుకులంలో సీట్ వచ్చింది. ప్రైవేట్ స్కూల్‌లో ఉన్నప్పుడు స్టడీస్‌పైనే ఎక్కువగా ఫోకస్ ఉండేది. గురుకులంలోకి వచ్చాకే.. ఆటలపై శ్రద్ధ చూపించాను. అన్ని గేమ్స్ ఆడేవాడిని. మా పీటీ సార్ వాలీబాల్ బాగా ఆడటం చూసి హై జంప్‌కు తీసుకెళ్లారు. అప్పటి నుంచి సార్ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అలా నేను క్రీడల్లోకి అడుగు పెట్టాను. ''- ప్రణయ్, క్రీడాకారుడు
సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరిన తరువాత వాలీబాల్ ఆడుతున్న క్రమంలో ప్రణయ్ ఆటతీరును గమనించిన పీఈటీ సంతోష్ జంప్ బాగా చేశావని కితాబు ఇచ్చారు. పాఠశాల స్థాయిలో నిర్వహించిన హై జంప్ పోటీలకు ప్రణయ్‌ని తీసుకెళ్లాడు కోచ్. ఆ పోటీల్లో ప్రణయ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి హై జంప్‌లో శిక్షణ పొందుతూ అదే ఉత్సాహాంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు.
2019లో తెలంగాణ ప్రభుత్వం స్టోర్స్ అకాడమీల కోసం గురుకుల పాఠశాలల నుంచి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసింది. అందులో శిక్షణకు ఈ ప్రతిభవంతుడు ఎంపికైయ్యాడు. అప్పటి నుంచి హైదరాబాద్ షేక్ పేటలోని అకాడమీలో పాఠాలు వింటూ ఉదయం, సాయంత్రం వేళలో గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేస్తున్నారు. హై జంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటుతున్నాడు.
''మా సార్ ట్రైనింగ్‌తో నేను మెడల్స్ కొట్టాను. ఒకవైపు చదువు... మరోవైపు ఆటలు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. అలా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని.. మెడల్స్ కొట్టాను. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహాకరాలు బాగున్నాయి. భవిష్యత్తులో నేను ఒలింపిక్స్ ఆడి.. స్వర్ణ పతకం సాధించడమే నా లక్షం.''- ప్రణయ్, క్రీడాకారుడు
క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బంగారు పతకాలను సొంతం చేసుకున్నాడు ప్రణయ్. ఇటీవల భోపాల్ జరిగిన ఖేలో ఇండియా పోటీలను స్వర్ణం దక్కించుకున్నాడు. జూన్‌లో జరగబోయే జూనియర్ ఏషియాకు అర్హత సాధించే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు చెబుతున్నాడు. ప్రణయ్ నైపుణ్యం కల్గిన క్రీడాకారుడని.. చదువులోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడని కోచ్ అంటున్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని పతకాలు తీసుకువచ్చి దేశానికి, రాష్ర్టానికి మంచి పేరు తీసుకువస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న సహాయ, సహాకారాల వల్లే తాను జాతీయ స్థాయిలో రాణిస్తున్నాను అంటున్నాడు ఆ క్రీడాకారుడు ప్రణయ్. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో పాల్గొని ట్రిపుల్ జంప్‌లో స్వర్ణ పతకం సాధించడమే తన ముందున్న లక్ష్యం అని చెబుతున్నాడు.
ఇవీ చూడండి..