తెలంగాణ

telangana

ETV Bharat / state

Godavari Floods 2023 : ఏటా భారీ వర్షాలకు గోదావరికి పోటెత్తుతున్న వరదలు.. ప్రజల కన్నీటి వెతలు తీరేదెలా - భద్రాద్రి వద్ద గోదావరి వరదలు

Godavari Floods Effect on Khammam : గోదావరికి వరద పోటెత్తింది. భారీ వర్షాలకు మహోగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతాల ప్రజానీకానికి కంటిమీద కనుకు లేకుండా చేసింది. తరుముతున్న గోదావరి వరదలతో ఇళ్లు వాకిలి వదిలి... ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ... రోజుల తరబడి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. ప్రస్తుతానికి గోదారమ్మ శాంతించినా... ఆనవాళ్లు లేకుండా పోయిన ఇళ్లు, కొట్టుకుపోయిన సామాగ్రి, ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేస్తున్న పంటలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎటుచూసినా నిలువనీడ లేని ఇళ్లు, ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా ఏటా గోదావరి వరద ధాటికి పరివాహక ప్రాంతాల్లో నెలకొనే దయనీయ దుస్థితి. ఒకటి కాదు 2 కాదు.. 50 ఏళ్లుగా ఇదే గోస. ఏటా వరదలు.. కన్నీటి వెతలే గోదావరి పరివాహక ప్రాంతాలు, వరద ముంపు ప్రాంత బాధితుల్ని నట్టేట ముంచుతున్నాయి. గతేడాది వరదల నుంచి తేరుకోకముందే.. ఈ సంవత్సరం కూడా వరద... గోదావరి పరివాహక ప్రజలను కోలుకోలేని దెబ్బతీసింది.

godavari floods
godavari floods

By

Published : Aug 2, 2023, 5:46 PM IST

ఏటా భారీ వర్షాలకు గోదావరికి వరదలు.. ప్రజల కన్నీటి వెతలు తీరేదెలా

Godavari Floods Effect on Telangana 2023 : చుట్టూ కొండ కోనలు.. మధ్యలో గలగల పారే గోదావరి.. వాటిని అనుకుని ఉన్న పచ్చని ప్రకృతి.. ఇవన్నీ కలిపి.. అక్కడి పరివాహక ప్రాంతాలు ప్రత్యేకఅందం సంతరించుకుంటాయి. సాధారణ రోజుల్లో గోదావరి పల్లెలన్నీ ఇలా సందడిగా ఉంటాయి. కానీ, వానాకాలం వచ్చిందంటే గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరిక దాటుతుందంటే... ముంపు ప్రాంతాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. 50 ఏళ్లుగా గోదావరి వరదలు మిగిల్చిన నష్టాలు, అనుభవాలు ముంపు ప్రాంతాల ప్రజల కళ్లముందే కదలాడుతుంటాయి. ఇక గతేడాది గోదావరి వరదలు ఊహకందని విషాదం మిగిల్చింది. గతేడాది జూలైలో గోదావరికి పోటెత్తిన వరదలు చరిత్రలోనే గోదావరికి వచ్చిన 3వ అతిపెద్ద వరదలుగా నిలిచాయి. గత జులైలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 71.3 అడుగులకు చేరి.. పరివాహక పల్లెలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఊళ్లకు ఊళ్లు వరదల్లో మునిగిపోయాయి. వరద ప్రళయం గోదావరి పల్లెలను కకావికలం చేసి పూడ్చలేని నష్టం మిగిల్చింది.

Godavari Water Levels at Bhadradri : వర్షాకాలం వచ్చిందంటే ఎగువన, రాష్ట్రంలో కురిసే వర్షాలతో గోదావరికి ఏటా తీవ్ర వరదలు వస్తున్నాయి. గోదావరి చరిత్రలోనే భద్రాచలం వద్ద నీటిమట్టం 70 అడుగులు దాటిన సందర్భాలు 3 ఉన్నాయి. అయితే, వీటిని ప్రమాద హెచ్చరికలతో కొలుస్తారు. 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 50 ఏళ్లలో భద్రాచలం వద్ద గరిష్ఠ ప్రవాహాలు పరిశీలిస్తే.. 20 సార్లకు పైగా 3వ ప్రమాద హెచ్చరిక. 27 సార్లు రెండో ప్రమాద హెచ్చరిక... జారీ చేశారు. గరిష్ఠంగా 1986లో 75.6 అడుగులు, 1990లో 70.8 అడుగులు, 2022లో 70.3 అడుగుల మేర గోదావరి ప్రవహించింది. ఐతే, ఈ ప్రవాహాలే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని జనజీవనాన్ని అతాలాకుతలం చేశాయి. తొలి 2 హెచ్చరికల స్థాయికి నీటిమట్టం వచ్చినప్పుడు ప్రజలు కొంతమేర తట్టుకుంటారు. కానీ, మూడో ప్రమాద హెచ్చరిక దాటడం వల్ల... ప్రజలు గ్రామాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లడం... ఇళ్లల్లో ఉన్న వస్తువులు, పంటలు, పశు సంపదను కోల్పోతుండటంతో... ఆర్థికంగా కోలుకోలేని నష్టం జరుగుతోంది.

గోదావరి సమీపంలోని ప్రజలకు తప్పని కన్నీళ్లు : గోదావరి వరదల ప్రభావం ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరగంల్, ఖమ్మం జిల్లాలపై ప్రధానంగా పడుతోంది. ఈ జిల్లాల్లో గోదావరికి ఇరువైపులా ఉన్న అనేక మండలాలు ఏటా వరద ప్రభావానికి గురవుతున్నాయి. రెండు మూడేళ్లకోసారి నష్టం తీవ్రంగా ఉంటోంది. గోదావరికి గతేడాది జులైలో భారీ వరద పోటెత్తి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత వరదలు మళ్లీ ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టాయి. 5 దశాబ్దాల్లో గోదావరి వరదలను పరిశీలిస్తే, సరాసరి ప్రతీ రెండేళ్లకోసారి గోదావరి సమీపంలోని మండలాల ప్రజలకు కన్నీళ్లు తప్పడం లేదు. గోదావరి వరదల తీవ్రతతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతేడాది వరదల ప్రళయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 180 గ్రామాలు పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయాయి. దాదాపు 16 వేల మంది నిరాశ్రయులయ్యారు. అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర నష్ట పోయాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే దాదాపు 125 కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది. వ్యవసాయం, విద్యుత్తు, జాతీయ రహదారులు, మిషన్ భగీరథ శాఖలకు భారీగా నష్టం వాటిల్లింది. ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోనూ వందలాది గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

అత్యంత దయనీయంగా మారిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈసారి కూడా గోదావరి వరదలు పరివాహక ప్రాంతాల ప్రజలకు తీరని నష్టం మిగిల్చాయి. 50 అడుగుల ఎత్తు దాటి వరద ప్రవాహం పోటెత్తడంతో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం 11 మండలాలను వరదలు అతలాకుతలం చేశాయి. వందల గ్రామాల్లో వరద నీరు పోటెత్తింది. ప్రధానంగా ప్రభావం చూపిన 90 గ్రామాలకు చెందిన సుమారు 10 వేల మంది వరద బాధితులను ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది. అనేక చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. వందల ఇళ్లు నీటమునిగాయి. వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రాథమికంగా దాదాపు 8 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. వేల ఎకరాల్లో పంటలు నష్టపోవడమే కాకుండా గోదావరి వరదతో పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. గతేడాదీ ఇలానే నష్టపోయిన అన్నదాతలు.. ఇసుక మేటలు తొలగించేందుకు అనేక పాట్లు పడ్డారు. వేలకు వేలు పెట్టి ఇసుక మేటలు తొలగించుకున్నారు. గతేడాది మిగిల్చిన నష్టాలను అధిగమించేందుకు ఈ సారైనా సీజన్ సానుకూలంగా ఉంటుందనుకుని మళ్లీ సాగు చేశారు. కానీ, ప్రకృతి అన్నదాతను మళ్లీ కరుణించలేదు.

ఆ విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి వీడాలి : వరద బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం ఏటా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. అయినప్పటికీ ఎక్కడా సరిపడా సౌకర్యాలు ఉండటం లేదు. అంతేకాదు.. సురక్షిత ప్రాంతాల్లో 3 నెలలకు సరిపడా బియ్యం, ఆహార పదార్థాలు నిల్వ చేయాలన్న ఉద్దేశంతో బఫర్ స్టాక్‌ను అమలు చేయాల్సి ఉంది. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నా.... రవాణా వ్యవస్థ స్థంభించినా ప్రజల తిండికి ఇబ్బంది కావొద్దని వీటిని చేపట్టారు. కానీ, ఈ ప్రక్రియ ఏటా వరదల సమయంలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదు. బఫర్ స్టాక్ ఎక్కడెక్కడ ఎంత నిల్వ చేశారో స్పష్టత లేదు. గజ ఈతగాళ్లకు కూలీ చెల్లింపుల్లో ప్రభుత్వం నాన్చుడు ధోరణి వీడాలి. లాంచీలతో పాటు మరబోట్లు సిద్ధం చేయాలి. ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలి. అలాగే ఏ స్థాయిలో వరదొస్తే ఎన్ని ప్రాంతాలకు ప్రమాదమో ముందే హెచ్చరించేందుకు సెక్టోరియల్, నోడల్ అధికారుల్ని నియమించాలి. వైర్ లెస్ సెట్లు, మొబైల్ బృందాలను అప్రమత్తం చేయాలి. రోడ్లు మునిగితే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రణాళిక రూపొందించాలి. కానీ, ఇవి ఎక్కడ కన్పించని పరిస్థితి.

శాశ్వత పరిష్కార సూచించడం లేదని ఆరోపిస్తున్న బాధితులు : భద్రాచలం వంతెనపై గతేడాది రాకపోకలు నిలిపి వేసిన సమయంలో అంతరాష్ట్ర రవాణా పూర్తిగా నిలిచిపోయింది. పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు కల్పించి పిల్లలు, గర్బిణీలు, బాలింతలు, వృద్ధులపై ప్రత్యేక దృష్టిసారించాలి. కానీ, క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పన మిథ్యగానే మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం ప్రజలకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. వరదలకు కరకట్టల నిర్మాణమే శాశ్వత పరిష్కారమన్నది వరద బాధితులతోపాటు ప్రభుత్వానికీ తెలుసు. ఏళ్లు గడుస్తోన్న కేవలం సర్వేలు జరిపి చేతులు దులుపుకుంటున్నారు. గతేడాది భారీ వరదలతో ప్రభుత్వంలో కొంతమేర చలనం వచ్చింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈసారి కూడా ముంపు ప్రాంతాల్లోని బాధితులకు వరద కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక చర్యలు కాకుండా.. వరదలను ఎదుర్కొనే శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే.. గత 50 ఏళ్లుగా అనుభవిస్తున్న వరద కష్టాలను గోదావరి పరివాహక ప్రాంతాలు రాబోయే రోజుల్లోనూ ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంటుందని వాపోతున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details