గతంలో తెరాసకు 99 మంది కార్పొరేటర్లు ఉండేవారు. ఇప్పుడు సంఖ్య 56కు తగ్గింది. 47 సీట్లతో భాజపా ప్రతిపక్ష స్థానంలో బలంగా తన వాదనను వినిపిస్తుందని నిపుణుల అంచనా. అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, కాంట్రాక్టు పనులు, ఇతరత్రా ప్రతిపాదనలు చర్చ లేకుండా ఆమోదం పొందే అవకాశం ఉండదని గుర్తుచేస్తున్నారు.
ఖజానా ఖాళీ..
మేయర్ ఎన్నిక పూర్తవగానే కొత్త పాలకమండలి వీలైనంత త్వరగా సమావేశమై 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దును ఆమోదించాల్సి ఉంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు పద్దులోని ఆదాయ, వ్యయాలను అర్థం చేసుకుని, దానిపై చర్చ జరుపుతారా, లేక నేరుగా ఆమోదిస్తారా అని ఆర్థిక విభాగం అంచనాలు వేస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 15, 2020న పద్దు ప్రతిపాదనలు పాలకమండలికి అందాలి. జనవరి 10, 2021న సమావేశం ఏర్పాటు చేసుకుని దానిపై చర్చ జరపాలి. ఫిబ్రవరి 20న పద్దును ఆమోదించి, మార్చి 7న ప్రభుత్వానికి పంపాలి. డిసెంబర్ 1, 2020న గ్రేటర్ ఎన్నిక జరగడంతో ప్రక్రియ మొత్తం వాయిదా పడింది. కొత్త పాలకమండలి చొరవ తీసుకుని గడువులోపు రూ.5,600కోట్ల పద్దును ఆమోదించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
నిధులు వస్తేనే అభివృద్ధి పనులు
జీహెచ్‌ఎంసీ నగరంలో లక్ష ఇళ్లను నిర్మిస్తోంది. ప్రస్తుతం 30 వేల ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్లు కావాలి. ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కింద జరుగుతోన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయడం, ప్రతిపాదనల దశలో ఉన్న పనులపై నిర్ణయం తీసుకోవడం కూడా కొత్త పాలకమండలికి సవాలే. నిర్వహణ వ్యయం పెరిగింది. 4,400 ప్రజామరుగుదొడ్ల నిర్వహణకే ఏటా రూ.120 కోట్ల మేర ఖర్చు కానుంది. రవాణా విభాగం భారీఎత్తున సమకూర్చుకున్న అద్దె వాహనాలు, ఇతర ప్రత్యేక విభాగాల నిర్వహణతో ఉద్యోగులు, కార్మికుల జీతాలు చెల్లించలేని పరిస్థితి.