ఈయన పేరు క్లెమెంటో... తెలంగాణ జానపద గేయాల రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు. 32 ఏళ్ల కిందట మాయదారి మైసమ్మ పాటతో మొదలైన క్లెమెంటో పాటల ప్రస్థానం... అంచలంచెలుగా ఎదుగుతూ.. నాలుగున్నర వేల పాటలకు చేరింది. ఇంకా రాస్తూ... పాడుతూనే ఉన్నారు. క్లెమెంటో రాసిన పాటలు వింటుంటే... తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు... పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు ప్రజల్లో కూడా ఉరిమే ఉత్సాహం వచ్చేస్తుంది. ఆయన పాడుతుంటే ఎంతటి వారైనా సరే అప్రయత్నంగా చిందులేస్తుంటారు. జానపదాలు రాసే రచయితలు ఎంతో మంది ఉన్నా... క్లెమెంటో శైలే వేరు. అందుకే ఏళ్లు గడుస్తున్నా ఆయన రాసిన, రాస్తోన్న.. పాటలు.. గల్లీల్లో మారుమోగుతూనే ఉన్నాయి.
చిన్నప్పటి నుంచే
సికింద్రాబాద్ లాలగూడలో క్రైస్తవ కుటుంబంలో జన్మించిన క్లెమెంటోకు... పాటలు రాయడమంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి. ఎనిమిదో తరగతిలోనే లాలగూడ రైల్వే బాయ్స్ హైస్కూల్లో వార్షిక పత్రికలో పాట రాసి ప్రశంసలందుకున్నాడు. ఎన్నో చోట్ల అవకాశాల కోసం ప్రయత్నించినా... నిరాశే మిగిలింది.
బోనాల పాట..
1986లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో తన మిత్రుల సహకారంతో పాఠశాలలో రాసిన "పెద్ద చిక్కు వచ్చినాదిరో" పాట పాడాడు. ఆ పాట విన్న డీఆర్సీ రికార్డింగ్ కంపెనీ అధినేత యాదగిరిరావు క్లెమెంటోను ప్రోత్సహించి తన ఆడియో క్యాసెట్లో పాటపాడే అవకాశం ఇచ్చారు. లష్కర్ జాతరలో బోనాల పండుగ పాట పాడిన క్లెమెంటో అక్కడి నుంచి వెనక్కి తిరిగిచూడలేదు. మూడేళ్లలో 80కిపైగా పాటలు రాశాడు. రాయడంతోపాటు పాడటం, సంగీతం చేకూర్చడం చేసేవాడు.
మలుపు తిప్పిన మైసమ్మ..