FATHER'S DAY: నాన్న అమ్మకుమల్లే బోళామనిషి కాడు. కలిగే కష్టాలు, తగిలే గాయాలు బహిర్గతం చేయని ధీరగంభీరుడు. కాఠిన్యాలూ, కన్నెర్రజేయడాలూ ప్రేమలేక కాదు, దాన్ని వ్యక్తం చేయలేకా కాదు. ఎదుగుదల ఆగక, విజయపథంలో దూసుకుపోవాలన్న ఆరాటమే ఆయన్ని మౌనంగా ఉంచేస్తుంది. బిడ్డ గెలిచినప్పుడు మనసులోనే అభినందిస్తాడు. ఆ బిడ్డే ఓడిపోతే భుజం తట్టి ధైర్యం చెబుతాడు. అదీ తండ్రి శైలి. అదే ఆయన ఔన్నత్యం.
తండ్రి తానే స్వయంగా పుత్ర రూపంలో జన్మిస్తాడన్నది వేదసూక్తం. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల ‘అంగాదంగాత్ సంభవతి పుత్రః హృదయాదభిజాయతి ఆత్మావై పుత్ర నామాసి- అనే వేద వచనం వినలేదా? శరీర కణాల నుంచే కాదు, హృదయ అనుభూతితో జన్మించేవాడు పుత్రుడు. తండ్రి లక్షణాలు కొడుకులో ప్రతిఫలిస్తాయి కనుక ఇతడు నీ పుత్రుడో కాదో నువ్వే పరీక్షించుకో’ అంటుంది దుష్యంతునితో.
జఠరాగ్ని వల్ల కడుపులోని ఆహారం జీర్ణమై రక్త, వీర్యాలుగా మార్పు చెంది సంతానోత్పత్తికి కారణమవుతుంది. అగ్ని సృష్టికారక శక్తి- అంటూ రుగ్వేదం అగ్నిని పితృసమంగా అభివర్ణించింది. అలాగే అగ్ని లక్షణాలన్నీ తండ్రికి ఉంటాయంటూ అగ్ని గుణధర్మాల గురించి చెబుతున్న సందర్భంలో తండ్రిని అగ్నితో పోల్చడం చూస్తాం.
యస్మాత్పార్దివ దేహః ప్రాదుర భూద్యేన భగవతా గురుణా
ఎవరివల్ల ఈ భౌతిక శరీరం జన్మించిందో అలాంటి భగవత్ స్వరూపుడు, సర్వజ్ఞమూర్తి అయిన తండ్రికి వేలాది నమస్కారాలు’ అన్నది దీని భావం.
‘తండ్రిని సేవించడమే పరమ ధర్మం. తండ్రిని అన్ని విధాలా సుఖపెట్టడం, ధర్మవర్తనుడైన తండ్రి ఆదేశాలను అనుసరించడం సర్వ శ్రేష్టమైన తపస్సు. తండ్రిని ప్రసన్నం చేసుకుంటే సకల దేవతలూ ప్రసన్నులౌతారు’ అంటోంది మహాభారతం.
‘నేను నిముసంబు గానక యున్న నూరెల నరయు మజ్జనకుండు..’ అంటూ తండ్రి మనసు ఎలాంటిదో, అలాంటి తండ్రి పట్ల కుమారుడు ఎలా ప్రవర్తించాలో మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు పలికిన ఈ మాటలతో తెలుస్తుంది.
తప్పటడుగుల వయసులో చేయూతనందించి, తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్ది, త్యాగాలకు గాంభీర్యపు పూత పూసేది నాన్నే.
దారుణే చ పితా పుత్రే నైవ దారుణతాం వ్రజేత్
పుత్రార్థే పదఃకష్టాః పితరః ప్రాప్నువన్తి హి
పుత్రుడిది ఒకవేళ క్రూర స్వభావమైనా కూడా తండ్రి అతనితో ప్రేమగానే నడచు కుంటాడు. కుమారుడి కోసం ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా ఎదుర్కొంటాడు- అంటూ అభివర్ణించారు హరివంశ పురాణం విష్ణు పర్వంలో.
నతో ధర్మాచరణం కించిదస్తి మహత్తరమ్
యథా పితరి శుశ్రూషా తస్య వా వచనక్రిపా