తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ డాక్టర్ ఫీజు 10 రూపాయలే.. ఎక్కడో తెలుసా..! - Dr. Noori Parveen fee is 10 rupees

ప్రైవేటు ఆసుపత్రి మెట్లు ఎక్కడానికే సామాన్యులు భయపడుతుంటారు. వందలూ, వేలు చెల్లించే స్తోమతలేక ఎంతో ఇబ్బందిపడుతుంటారు. కేవలం రూ.10 ఫీజు తీసుకుంటూ వారికి అండగా నేనున్నానంటోంది ఈ యువ వైద్యురాలు.

special story on Doctor Noori Parveen
ఈ డాక్టర్ ఫీజు 10 రూపాయలు!

By

Published : Dec 15, 2020, 11:24 AM IST

ఆంధ్రప్రదేశ్​ విజయవాడకు చెందిన నూరీ పర్వీన్‌ కడపలోని ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చేసింది. అక్కడ చదువుకునే రోజులనుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. చదువు పూర్తయ్యాక 104 వైద్యసేవల విభాగంలో, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసింది. ఈ సమయంలోనే పేదలకు సాయపడాలని నిర్ణయించుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో కడపలోని మాసాపేటలో ఆసుపత్రిని ప్రారంభించింది. అంతలోనే కరోనా, లాక్‌డౌన్‌... ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకాడలేదు. ఆ సమయంలో జ్వరంతో వచ్చే వాళ్లని చూడటానికి కార్పొరేట్‌ ఆసుపత్రులవాళ్లే భయపడినా పర్వీన్‌ మాత్రం వారిని తనిఖీ చేసేది.

సేవల్లోనూ ముందే...

రెండేళ్ల కిందట పర్వీన్‌ రెండు సేవా సంస్థలను ప్రారంభించింది. వాటిలో ‘ఇన్‌స్పైరింగ్‌ హెల్తీ యంగ్‌ ఇండియా’ ద్వారా విద్య, వైద్య అంశాలపై స్ఫూర్తి కలిగించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాతయ్య పేరు మీద ఏర్పాటుచేసిన ‘నూర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు’ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో రోజూ వందమందికి భోజన ఏర్పాట్లుచేసి వారి ఆకలి తీర్చింది. ఈ సేవలను గుర్తింపుగా పర్వీన్‌కు ఎన్నో సంఘాలు, సంస్థల్లో సభ్యత్వం లభించింది. ‘మా తల్లిదండ్రుల నుంచే ఈ సేవాగుణం అబ్బింది. వాళ్లు ఇప్పుడు ముగ్గురు అనాథలను సొంత ఖర్చులతో చదివిస్తున్నారు.

నేను కడపలో క్లినిక్‌ ప్రారంభించినప్పుడు అమ్మానాన్నలకూ చెప్పలేదు. రెండు నెలల తర్వాత విషయం తెలుసుకుని వాళ్లు ఎంతో సంతోషించారు. ప్రస్తుతం ఇక్కడికి రోజూ సుమారు 40 మంది వస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు బెడ్‌ ఫీజు కూడా కేవలం రూ.50 మాత్రమే వసూలుచేస్తున్నా. మానసిక వైద్యశాస్త్రంలో పీజీ చేయాలనుకుంటున్నా. భవిష్యత్తులో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనుకుంటున్నా. అప్పుడు కూడా తక్కువ ఫీజుకే వైద్య సేవల్ని అందించాలనుంది’ అని తన భవిష్యత్తు ప్రణాళికనీ వివరిస్తుంది పర్వీన్‌.

ABOUT THE AUTHOR

...view details