తెలంగాణ

telangana

ETV Bharat / state

పాజిటివ్‌ రాగానే గాంధీకి సిఫారసు.. ఇంటివద్దే చికిత్స పొందండంటూ వెనక్కి - CORONA LATEST NEWS

కోటి మంది జనాభా ఉన్న మహా నగరంలో కరోనా బాధితులకు ప్రభుత్వ రంగంలో కేవలం గాంధీ ఆసుపత్రి మాత్రమే పూర్తిస్థాయి వైద్యం అందిస్తోంది. మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులన్నీ సహాయక పాత్రే పోషిస్తున్నాయి. గాంధీకి వెళితే ప్రమాదకర లక్షణాలు లేవు.. ఇంట్లో ఉండి చికిత్స పొందండంటూ వెనక్కి పంపుతున్నారు. మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే కొవిడ్‌ బాధితులు గాంధీలోనే చికిత్స పొందాలని స్పష్టంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులు వైద్యం కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

special STORY ON CORONA SUFFERERS PROBLEMS
పాజిటివ్‌ రాగానే గాంధీకి సిఫారసు.. ఇంటివద్దే చికిత్స పొందండంటూ వెనక్కి

By

Published : Jul 18, 2020, 7:15 AM IST

పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దిన గాంధీ ఆసుపత్రిలో 2 వేల మందికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాాబాద్​లో మరో పదికిపైగా చిన్నా పెద్దా ప్రభుత్వ వైద్యశాలలను కరోనా సేవలందించేలా తీర్చిదిద్దారు. కీలకమైన కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో కొన్ని పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉండటంతో అత్యవసరమైన వైద్యం అందించాలని సర్కార్‌ ఆదేశించింది. ఒక్కో వైద్యశాలలో 250 నుంచి 400 వరకు పడకలు ఉన్నాయి. వీటిల్లో పూర్తిస్థాయిలో వైద్యం అందితే వేలాది మంది బాధితులకు ఉపశమనం లభించేది. కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు.

అనుమానితులను చేర్చుకొని ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ అని తేలితే అప్పటికే ఆక్సిజన్‌ అందిస్తున్నా వెంటనే గాంధీకి వెళ్లాలని చెబుతున్నారు. ఇలా వచ్చిన రోగుల్లో ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నవారినే గాంధీలో చేర్చుకుంటున్నారు. లక్షణాలు తక్కువ ఉండడం, ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నా ఇళ్లలో ఉండాలంటున్నారని, అక్కడ ఆక్సిజన్‌ ఎలా దొరుకుతుందని బాధితులు వాపోతున్నారు.

తీవ్రమైన లక్షణాలతో వచ్చే వారిని చేర్చుకొని అత్యవసర వైద్యం అందిస్తున్నాం. ఎవరినీ నిరాకరించడం లేదు. తక్కువ లక్షణాలుంటే ఇంట్లో వైద్యం పొందాలని చెప్పి పంపిస్తున్నాం. మరో వెయ్యి పడకలు ఖాళీ ఉన్నాయి.

- డాక్టర్‌ రాజారావు, గాంధీ ఆసుపత్రి

అందరికీ తక్షణ వైద్యం అందిస్తున్నాం

అనుమానితులను వెంటనే చేర్చుకొని తక్షణ వైద్యం అందిస్తున్నాం. పాజిటివ్‌గా వస్తే గాంధీకి పంపిస్తున్నాం. ఈలోపు ఆక్సిజన్‌ అవసరమైతే ఏర్పాటు చేస్తున్నాం.

- డాక్టర్‌ మహబూబ్‌ఖాన్, ఛాతీ ఆసుపత్రి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదీ పరిస్థితి

  • నిమ్స్‌: కేవలం వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే కరోనా వైద్యం అందిస్తున్నారు. సామాన్య పౌరులను చేర్చుకోవడంలేదు.
  • ఉస్మానియా: కరోనా బాధితులకు 60 పడకలు కేటాయించారు. తక్కువ లక్షణాలున్నవారికే చికిత్స చేస్తున్నారు.
  • టిమ్స్‌: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో వారం కిందట అధికారికంగా వైద్య సేవలు ప్రారంభించారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతున్నారు. 1500కు 1200 పడకలు సిద్ధమయ్యాయి.
  • ఆయుర్వేద, నేచర్‌క్యూర్, సరోజినీదేవీ ఆసుపత్రులు: వీటిల్లో ఐసోలేషన్‌ కేంద్రాలున్నా సాధారణ లక్షణాలున్న వారినే చేర్చుకుంటున్నారు. ఆక్సిజన్‌ పెట్టాలన్నా, అత్యవసర వైద్యం అందించాలన్నా గాంధీకి పంపిస్తున్నారు. ఐసోలేషన్‌ కేంద్రాల్లో చేరాలంటే పాజిటివ్‌ నివేదిక, పీహెచ్‌సీ, యూహెచ్‌సీల సిఫారసు లేఖ అవసరమంటున్నారు.
  • ఛాతీ, ఫీవర్, కింగ్‌కోఠి ఆసుపత్రులు: ఛాతీ ఆసుపత్రిలో 250 పడకలను ఏర్పాటు చేయగా మొత్తం అనుమానిత రోగులతో నిండిపోయింది. పాజిటివ్‌ నిర్ధారణ అయినవారిని ఉన్నపళంగా గాంధీకి పంపిస్తున్నారు. మిగిలిన వాటిల్లోనూ అదే పరిస్థితి.

ABOUT THE AUTHOR

...view details