కరోనాకు ఎవరూ అతీతులు కారు.. అన్ని వయసుల వారికి ముప్పే! - Corona cases in Hyderabad
నేను యువకుడ్ని.. నాకెందుకు కరోనా సోకుతుంది.. అని భావిస్తున్నారా.. నా వయసు 60 దాటింది.. కరోనా సోకితే ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారా.. మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు.. వారికి కొవిడ్ రాదులే అని ధీమాతో ఉన్నారా.. ఈ నమ్మకాలన్నీ నిజం కాదని నిపుణులంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఇందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిస్తున్న గణాంకాలే నిదర్శనం.
కరోనాకు ఎవరూ అతీతులు కారు.. అన్ని వయసుల వారికి ముప్పే!
By
Published : Aug 26, 2020, 9:20 AM IST
ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. వైరల్ జ్వరాలతోపాటు మలేరియా, డెంగీ, గన్యా, స్వైన్‌ఫ్లూ షరామామూలే. ఈ తరుణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వైరల్ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, జ్వరం, దగ్గు సోకిన వెంటనే కరోనాగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులంటున్నారు. అయితే 3 రోజుల్లో తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలంటున్నారు. కరోనా లేకపోయినా జ్వరం కొనసాగుతుంటే డెంగీ, మలేరియా టెస్టులు కూడా చేయించాలని చెబుతున్నారు.
తాజా కేసులు..
గ్రేటర్‌లో 24 గంటల్లో 295, రంగారెడ్డి జిల్లాలో 186, మేడ్చల్ జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి. పీహెచ్‌సీలల్లో ఉదయం నుంచే క్యూ కడుతూ పరీక్షలు చేయించుకుంటున్నారు. గాంధీ ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 9 మంది మృతిచెందారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు వ్యాధి సోకింది. మొత్తం బల్దియా ఉద్యోగుల్లో 150 మందికి వైరస్ సోకగా ఆరుగురు మరణించారు.
కరోనా బారిన పడుతున్న వారిలో ఎక్కువగా 21 నుంచి 50 ఏళ్లలోపే దాదాపు 60 శాతంపైనే ఉన్నారు. అయితే 85 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు. దీంతో యథావిధిగా వీరు అందరితో కలిసి తిరుగుతున్నారు. వైరస్ వ్యాప్తికి వీరే ప్రధాన కారణం.
ప్రస్తుతం గ్రేటర్‌లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 250-450 మధ్య కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు వరకు కేసుల సంఖ్య 50 వేలు దాటింది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో సగం గ్రేటర్‌లో నమోదయ్యాయి. 85 శాతం మరణాలు గ్రేటర్‌లోనే సంభవించాయి.