‘ఆకలితో ఉన్నవాడికి ఓ పూట చేపల కూరతో మంచి భోజనం పెట్టొచ్చు. కానీ రోజూ పెట్టలేం కదా! అందుకుని అతనికి చేపలు పట్టడం నేర్పిస్తే సరి’... పెళ్లైన కొత్తలో భర్త శ్రీనివాస్ అన్న మాటలు మంజులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అవసరంలో ఉన్నవారికి సాయంతో పాటు నైపుణ్యాలని కూడా అందిస్తే అదే వాళ్ల జీవితాల్లో వెలుగు నింపుతుందని నమ్మింది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన మంజుల... తోటివారికి సాయం చేయాలన్న తపనతో మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ) చదివింది. 1999లో పది మందితో శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించి.. మహిళలకు కుట్టు, ఎంబ్రాయిడరీ వంటి వాటిలో శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టింది.
భర్త మద్దతు కూడా తోడవ్వడంతో ఆ కార్యక్రమాలను క్రమంగా విస్తృతం చేసింది. మొదట్లో సొసైటీ నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. కాలక్రమంలో ఘట్‌కేసర్ మండలంతోపాటు నల్గొండ, మహబూబ్‌నగర్, ప్రకాశం జిల్లాల్లో సొసైటీ కార్యక్రమాలు విస్తరించాయి. ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు అందుకుని స్వయం ఉపాధి పొందుతూ నెలకు రూ.12నుంచి రూ.18వేల వరకు సంపాదిస్తున్నారు. దాంతో సొసైటీని నాబార్డు గుర్తించి ఆర్థిక సాయం అందించింది. అప్పటి నుంచి మంజుల వెనుదిరిగి చూడలేదు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోసి, బంజారవర్క్, బ్లాక్ ప్రింటింగ్‌లతో పాటు బ్యాగులు, గృహాలంకరణ వస్తువుల తయారీని నేర్పించే వారు.